మిషన్‌ భగీరథ ప్రాజెక్టుకు హడ్కో అవార్డు

  0
  24

  మిషన్‌ భగీరథ ప్రాజెక్టుకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది.

   మౌలిక వసతుల కల్పన – వినూత్న విధానాల విభాగంలో అవార్డు ఇవ్వాలని హడ్కో(కేంద్ర గృహ నిర్మాణ, నగరాభివృద్ధి సంస్థ) నిర్ణయించింది. ఢిల్లీలో జరిగే హడ్కో వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ అవార్డును మిషన్‌ భగీరథ ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ కృపాకర్‌రెడ్డి స్వీకరిస్తారు. ఈ విభాగంలో మిషన్‌ భగీరథకు ఇప్పటికే రెండుసార్లు అవార్డు వచ్చింది.

  రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మిషన్ భగీరథ ప్రాజెక్టును చేపట్టింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మానసపుత్రిక అయిన ఈ ప్రాజెక్టుకు 2014 డిసెంబర్‌లో ప్రణాళికలను సిద్ధం చేయగా 2015 ఆగస్టులో పనులు ప్రారంభమయ్యాయి.

  ఈ పది నెలల కాలంలో మొత్తం ప్రాజెక్టు పనుల్లో దాదాపు 25 శాతం పూర్తయినట్లు అంచనా. రూ.40 వేల కోట్ల అంచనాతో ప్రారంభించిన మిషన్ భగీరథ ప్రాజెక్టుకు మొత్తం అంచనాలో 20 శాతం (రూ.8 వేల కోట్లు) రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా అందిస్తుండగా… హడ్కో, నాబార్డ్ తదితర ఆర్థిక సంస్థలు, వాణిజ్య బ్యాంకుల నుంచి రూ.32 వేల కోట్ల దాకా సమీకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే హడ్కో రూ.10 వేల కోట్లు, నాబార్డ్ రూ.3,200 కోట్లు రుణాలుగా ఇచ్చేందుకు అంగీకరించాయి.

  మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రణాళిక దశ నుంచే దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రశంసలు అందుకుంది. హడ్కో, నాబార్డు తదితర ఆర్థిక సంస్థలు దీనికి అవార్డులూ ఇచ్చాయి. ఆరు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు ఈ సంకల్పాన్ని ఎంతగానో ప్రశంసించారు. ఈ ప్రాజెక్టును తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ఆసక్తి చూపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మిషన్ భగీరథ ప్రాజెక్టు గురించి మన్‌కీబాత్ కార్యక్రమంలో ప్రస్తావించడం విశేషం.