మార్చి 8 నుంచి పోషణ్ అభియాన్ వార్షికోత్సవం

  0
  75

  జాతీయ పోషకాహార మిషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మార్చి 8 నుంచి 22 వరకు దేశవ్యాప్తంగా ‘పోషణ్ అభియాన్’ మొదటి వార్షికోత్సవాన్ని నిర్విహ స్తామని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రి మేనకా గాంధీ మార్చి 1న వెల్లడించారు.

  మూడు రాష్ట్రాల్లో దాదాపు 21 వేల మంది తక్కువ బరువుతో పుట్టిన శిశువులను గుర్తించామని మంత్రి తెలిపారు. వీరంతా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో 2017 అక్టోబర్ నుంచి 2018 అక్టోబర్ మధ్య పుట్టిన వారని చెప్పారు. వారిలో 15 వేల మంది శిశువులను సాధారణ స్థితికి తీసుకొచ్చామని వివరించారు.

  జాతీయ పోషకాహార మిషన్(ఎన్‌ఎన్‌ఎం)కు కేంద్రం అనుమతించింది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పిల్లల అభివృద్ధికి అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న ఆహారం సరిగా అందుతున్నదా? అనే విషయాన్ని తనిఖీ చేస్తారు.

  2017-18లో తొలివిడుతగా అత్యధిక జనాభా కల 315 జిల్లాల్లో ఈ మిషన్ ప్రారంభించారు. 2018-19లో 235 జిల్లాలు, 2019-20లో మిగతా జిల్లాల్లో అమలు చేస్తారు. 2020నాటికి పదికోట్ల మంది ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతారు.

  దీని అమలుకు రూ. 9046.17 కోట్ల విడుదలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2020 నాటికి తక్కువ బరువు కలిగిన శిశు జననాలను ఏడాదికి రెండు శాతం చొప్పున.. చిన్న పిల్లలు, మహిళలు, కౌమార బాలికల్లో రక్తహీనతను మూడు శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నది. లక్ష్యాన్ని చేరుకునేందుకు అంగన్‌వాడీలు, ఆశాలు, ఏఎన్‌ఎంలు అందిస్తున్న సేవలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.