మహిళల భద్రత కొరకు శక్తి టీంలు

    0
    8

    అతివల భద్రత కోసం విశాఖలో ‘శక్తి టీమ్‌’ పేరుతో మహిళా పోలీసు దళాన్ని రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ ప్రారంభించారు.

     మహిళలకు మరింత రక్షణకు గాను ‘శక్తి’ టీం మొబైల్‌ క్యాప్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ తెలిపారు. ఆర్కేబీచ్‌లో పోలీస్‌ మెస్‌ వద్ద శక్తి టీం మొబైల్‌ క్యాప్స్‌ను సీపీ మహేష్‌చంద్రలడ్డాతో కలిసి ఆయన జెండా ఊపి గురువారం ప్రారంభించారు.

    ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో 18 యూనిట్లతో శక్తి టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విశాఖ నగరంలో 35 మంది మహిళా పోలీసులతో శక్తి టీం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీరికి 5 కార్లు, 26 హోండా యాక్టివ్‌ వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలపై దాడులు, ఈవ్‌ టీజింగ్‌లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాయన్నారు.

    ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. అలాగే ఈ టీంలు నగరంలో వివిధ విద్యా సంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తాయన్నారు. ఈ టీంలు పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ (డయల్‌–100, 1090) దగ్గరలో ఉన్న జీపీఎస్‌ వైరల్‌ సెట్‌ ద్వారా అనుసంధానమై ఉంటాయన్నారు. 35 మంది శక్తి టీం సభ్యులు విజయనగరంలోని పీటీసీలో 21 రోజులపాటు శిక్షణ పొందారని తెలిపారు.

    వీరికి టూ వీలర్, ఫోర్‌ వీలర్‌ వాహనాల డైవింగ్, ఆత్మరక్షణ, మహిళలపై జరిగే నేరాలపై తీసుకొనే చట్టపరమైన చర్యలపై శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఈ టీం సభ్యులు నీలం రంగు షర్ట్, ఖాకీ ప్యాంట్‌ యూనిఫారం కలిగి ఉంటారన్నారు. రాత్రి వేళ రెండు టీంలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాబోయే రోజుల్లో శక్తి టీంలు పెంచుతామన్నారు.