భారత్ అమ్ములపొదిలోకి అధునాతన అస్త్రాలు

    0
    14

    దాదాపు 30 ఏళ్ల తర్వాత భారత ఆయుధాగారంలోకి పెద్ద స్థాయిలో ఆయుధ సంపత్తి చేరింది. మూడు ఎం777 అల్ట్రా లైట్‌ ఫిరంగులు, పది కే9 వజ్ర తరహా ఫిరంగులు సహా యుద్ధ క్షేత్రంలో సంచరించే ప్రత్యేక వాహనాలు (గన్‌ ట్రాక్టర్‌లు) కొత్తగా చేరిన వాటిలో ఉన్నాయి.

    శుక్రవారం మహారాష్ట్రలోని దేవ్‌లాలీ ఆర్టిలరీ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎస్‌కే సైనీ సమక్షంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ చేతుల మీదుగా వీటిని ఆర్మీలో చేర్చారు. 1980ల్లో బోఫోర్స్‌ శతఘ్నులను భారత ఆర్మీలో చేర్చిన తర్వాత పెద్ద స్థాయిలో ఆయుధాలు అమ్ముల పొదిలో చేరడం ఇదే తొలిసారి. ఎం777 రకానికి చెందిన తక్కువ బరువుండే ఫిరంగులు అమెరికా తయారు చేసినవి కాగా.. స్వీయ నియంత్రణ సామర్థ్యం ఉన్న కే9 వజ్ర ఫిరంగులను దక్షిణ కొరియా తయారు చేసింది. కే9 వజ్ర తరహా ఫిరంగుల పరిధి అత్యధికంగా 28 నుంచి 38 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. 30 సెకండ్లలో మూడు రౌండ్లు పేల్చడం వీటి ప్రత్యేకత. వివిధ రకాలుగా జరిపే కాల్పుల విషయంలో ఇది మెరుగ్గా పని చేయనుంది. ఎం777 తరహా ఆయుధాలను హెలికాప్టర్‌ సాయంతో ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. కొండ ప్రాంతాల్లో జరిపే యుద్ధ విన్యాసాలకు ఇవి బాగా ఉపయోగపడతాయి. వీటి పరిధి 30 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. ఇక గన్‌ ట్రాక్టర్‌ గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దానికి ఫిరంగి అనుసంధానిస్తే గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. ఈ కార్యక్రమంలో సీతారామన్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ తరహా ఆయుధాలను సమకూర్చుకోవడానికి మనకు 30 ఏళ్లు పట్టింది. మా ప్రభుత్వం ఏర్పడ్డాక వీటిని మన అమ్ముల పొదిలో చేర్చాలని ప్రయత్నిస్తున్నాం. అనేక ఒడుదొడుకుల మధ్య ఇప్పుడు వీటిని సమకూర్చగలిగాం. భవిష్యత్తులో మరిన్ని ఆయుధాలు ఆర్మీకి సమకూర్చనున్నాం’’ అని అన్నారు. 2020 కల్లా కె9 రకానికి చెందిన ఫిరంగులు మరో 100, ఎం777 రకానికి చెందిన ఆయుధాలు మరో 145.. కొత్తగా భారత ఆర్మీలో చేరతాయని రక్షణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. వీటి ఖరీదు సుమారు రూ.9,366 కోట్లని చెప్పారు.