భారత్‌లో ఆరు అణు కర్మాగారాల నిర్మాణము

  0
  11

  భారత్‌తో ద్వైపాక్షిక భద్రత, పౌర అణు రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడం కోసం ఆరు అణు విద్యుత్‌ కర్మాగారాలను నిర్మించడానికి అమెరికా అంగీకారం తెలిపింది.

  అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ సభ్యత్వం కోసం మద్దతు ఇస్తున్నట్లు వివరించింది.

  భారత్‌-అమెరికా వ్యూహాత్మక భద్రతా వ్యవస్థ 9వ విడత చర్చల అనంతరం రెండు దేశాలు ఈ సంయుక్త ప్రకటన వెలువడింది. ఈ చర్చలకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్‌ గోఖలే, అమెరికా ఆయుధ నియంత్రణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల శాఖ కార్యదర్శి ఆండ్రియా థాంప్సన్‌లు అధ్యక్షత వహించారు.

  పౌర అణు ఇంధన రంగంలో సహకారం కోసం రెండు దేశాలు 2008 అక్టోబర్‌లో ఒక చరిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఎన్‌ఎస్‌జీలోకి భారత్‌ త్వరగా ప్రవేశించాలన్న ఆకాంక్షను అమెరికా తాజాగా పునరుద్ఘాటించింది. ఇందుకు తన మద్దతు ఉంటుందని తెలిపింది.

  1974 మే 18 న భారత్ తన మొదటి అణ్వస్త్ర పరీక్ష జరిపింది. స్మైలింగ్ బుద్ధ పేరు గల ఈ పరీక్షను రాజస్థాన్ లోని పొఖ్రాన్‌లో జరిపారు. ఆ తరువాత, 1998 లో తిరిగి పొఖ్రాన్‌లోనే రెండోసారి పరీక్షలు జరిపింది. ఈసారి థెర్మోన్యూక్లియర్ పరీక్ష కూడా జరిపారు. దీనికి ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టారు.

  భారత్ విస్తారమైన పౌర, సైనిక అణు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కనీసం 10 అణు రియాక్టర్లు, యురేనియం గనులు, యురేనియం తయారీ క్షేత్రాలు, భారజల కర్మాగారాలు, ఒక యురేనియం శుద్ధి కర్మాగారం, ఇంధన తయారీ సౌకర్యాలు, విస్తృతమైన అణు పరిశోధన సామర్థ్యాలూ ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి.

  భారత్ తన అణ్వస్త్రాల సంఖ్యను గురించి వెల్లడి చెయ్యనప్పటికీ, వివిధ దేశాల అంచనాలను బట్టి, భారత్ వద్ద 150 నుండి 300 దాకా అణ్వస్త్రాలున్నాయి.