భవిష్య నిధి (పీఎఫ్‌) డిపాజిట్లపై వడ్డీ రేటు పెంపు

  0
  8

  భవిష్య నిధి (పీఎఫ్‌) డిపాజిట్లపై 2018-19 సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ చెల్లించాలని ప్రతిపాదించినట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ వెల్లడించారు.

  ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) కేంద్ర ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం 8.55 శాతం వడ్డీ రేటు ఉండగా, దాన్ని పెంచాలని సభ్యులందరూ నిర్ణయించారని తెలిపారు.

  ఆర్థిక శాఖ ఆమోదం లభించిన తరువాత పీఎఫ్‌ పరిధిలో ఉన్న దాదాపు ఆరు కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ అవుతుంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో వడ్డీ రేటును పెంచినట్టు భావిస్తున్నారు.

  ఉద్యోగుల భవిష్య నిధి పథకం 1952 (Employees’ Provident Fund Scheme -1952 ):

  20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగాస్తులుగా కలిగిన అన్ని ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, సంస్థలు తప్పనిసరిగా ఈ పథకం కిందికి వస్తాయి. అటువంటి సంస్థలలో రూ. 15000 అంతకంటే తక్కువ ప్రాథమిక వేతనం (Basic Wages) కలవారు తప్పనిసరిగా సభ్యులుగా చేరవలసి ఉంటుంది. వేతనం రూ. 15000 కంటే ఎక్కువ ఉన్నవారు కూడా యాజమాన్య – ఉద్యోగ పరస్పర అంగీకారంతో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు అభ్యర్ధన పత్రం సమర్పించి సభ్యులుగా చేరవచ్చు. ఉద్యోగుల భవిష్య నిధి పథకం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ద్వారా నిర్వహింపబడుతున్న ౩ పథకాలలో ముఖ్యమైనది. మిగతా రెండు పథకాలు ఉద్యోగుల పించను పథకం మరియు ఉద్యోగుల జమ ఆధారిత బీమా పథకం .