బీఓబీ చైర్మన్‌గా హస్‌ముఖ్ అదియా

  0
  8

  బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) చైర్మన్‌గా మాజీ ఆర్థిక కార్యదర్శి హస్‌ముఖ్ అదియా నియమితులయ్యారు. ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ ఈ మేరకు మార్చి 1న తెలిపారు.

  కేంద్రం గతంలో ప్రతిపాదించిన మూడు ప్రభుత్వ బ్యాంకుల విలీనానికి ముహూర్తం ఖరారైంది. విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌లు.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో కలిసిపోబోతున్నాయి. ఏప్రిల్ 1న అధికారికంగా ఇవన్నీ ఒక్కటవుతాయని బ్యాంక్ ఆఫ్ బరోడా బోర్డ్ ప్రకటించింది.

  మార్చి 11,2019ని రికార్డ్ డేట్‌గా ప్రకటించిన బ్యాంక్ ఆ లోపు షేర్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయబోతోంది. విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో కలుస్తున్న నేపధ్యంలో ఆ రెండు బ్యాంక్ షేర్ హోల్డర్లకు ఈ షేర్లు రాబోతున్నాయి.

  ఎవరికి ఎన్ని షేర్లు

  1000 షేర్లు కలిగిన విజయా బ్యాంక్ షేర్ హోల్డర్లకు 402 బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు లభించబోతున్నాయి. అదే 1000 దేనా బ్యాంక్ షేర్లు కలిగిన షేర్ హోల్డర్లకు 110 బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు రాబోతున్నాయి. ఇది గతంలోనే ఖరారు చేసిన సంగతి అందరికీ తెలుసు. మార్చిలో ఇచ్చిన రికార్డ్ డేట్‌లోగా షేర్ హోల్డర్లందరికీ ఇవన్నీ అందబోతున్నాయి. అప్పుడు విలీన ప్రక్రియ అధికారికంగా పూర్తైందని అనుకోవాలి.
  చిన్న బ్యాంకులన్నింటినీ విలీనం చేసి పెద్ద బ్యాంకులుగా మారిస్తే ప్రయోజనం ఉంటుందని కేంద్రం భావిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా చిన్న బ్యాంకులకు మనుగడ కష్టంగా ఉంది. ఎన్పీఏల భారం పెరిగి పూర్తిగా మునిగిపోయే స్థితిలో ఉన్న బ్యాంకుల వల్ల అటు ఉద్యోగులకు, ఆర్థిక వ్యవస్థకూడా పెను ముప్పు ఉన్న నేపధ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రభుత్వ బ్యాంకులను కూడా ఈ దిశగా తీసుకురాబోతున్నారు.