బిక్స్ దేశాధినేతల భేటీలో మోదీ ప్రసంగం

  0
  11

  అర్జెంటీనా రాజధాని బ్యూనస్ఏయిర్స్లో నవంబర్ 30న ప్రారంభమైన జీ-20 (గ్రూప్ ఆఫ్ 20) సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ దేశాల నాయకులతో అనధికారికంగా సమావేశమయ్యారు.

  ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమేనని అన్నారు. ఆర్థిక నేరగాళ్ల వల్ల ప్రపంచం ఆర్థిక స్థిరత్వానికి తీవ్ర ముప్పు ఎదురవుతోందనీ, మోసాలు చేసి స్వదేశాల నుంచి పరారైన నేరగాళ్లకు వ్యతిరేకంగా కూడా అన్ని దేశాలూ సహకరించుకోవాలని సూచించారు.

  మరోవైపు మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబేల మధ్య తొలి త్రైపాక్షిక భేటీ నవంబర్ 30న జరిగింది. ప్రపంచ, బహుళ ప్రయోజనాలున్న ప్రధానాంశాలపై వారు చర్చలు జరిపారు. జై (జేఏఐ – జపాన్, అమెరికా, ఇండియా) సమావేశం ప్రజాస్వామ్య విలువలకు అంకితం. పలు భారతీయ భాషల్లో జై అంటే విజయం అని అర్థం’ అని ఈ సందర్భంగా మోదీ అన్నారు.

  మరోవైపు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ప్రత్యేకంగా సమావేశమైన మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్, సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్లతోనూ విడివిడిగా భేటీ అయ్యారు. బ్యూనస్ ఎయిర్స్లో నిర్వహించిన యోగా ఫర్ పీస్ కార్యక్రమంలోనూ మోదీ పాల్గొన్నారు. శాంతి, ఆరోగ్యం కోసం ప్రపంచానికి భారత్ అందించిన బహుమతి యోగా అని మోదీ అన్నారు.