బాలాకోట్‌పై వైమానిక దాడులకు సంకేతనామం

  0
  6

  పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ‘జైష్ ఎ మహ్మద్’ ఉగ్రవాద సంస్థకు చెందిన స్థావరాలపై ఫిబ్రవరి 26న జరిపిన వైమానిక దాడులకు భారత సైనిక దళాలు సంకేతనామాన్ని వినియోగించాయి.

   12 మిరాజ్ -2000 యుద్ధవిమానాలతో బాలకోట్‌పై దాడి చేసిన భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ‘‘ఆపరేషన్ బందర్(కోతి)’’ అని పేరు పెట్టింది. అదే సమయంలో పాకిస్థాన్ దాడులు చేస్తే తిప్పికొట్టడానికిగాను సరిహద్దుల వెంబడి మన సైన్యం భద్రతను బలోపేతం చేసింది. అత్యున్నతమైన కార్యాచరణ అప్రమత్తతను ప్రకటించింది.

  దీనికి ‘‘ఆపరేషన్ జఫ్రాన్(కుంకుమ పువ్వు)’’ అనే సంకేతనామం పెట్టింది. భారతీయ నావికాదళం మాత్రం ఎలాంటి సంకేతనామం పెట్టలేదు. ‘‘ట్రోపెక్స్ 2019’’ పేరిట యుద్ధనౌకలు, జలాంతర్గాములతో అప్పటికే ఉత్తర అరేబియా సముద్రంలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది.

  2019, ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఓ సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 40 మందికి పైగా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే భారత వాయుసేన బాలాకోట్ ఆపరేషన్ జరిపింది.