బయోగ్రఫీ ఆఫ్ ఏఆర్ రెహమాన్ పుస్తకావిష్కరణ

  0
  14

  రచయిత కృష్ణ త్రిలోక్ రాసిన ‘నోట్స్ ఆఫ్ ఏ డ్రీమ్: ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ ఏఆర్ రెహమాన్’ పుస్తకంను ముంబైలో నవంబర్ 4న జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ఆవిష్కరించారు.

  ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ… నాకు పాతికేళ్లు ఉన్నప్పుడు మణిరత్నం తెరకెక్కించిన ‘రోజా’ సినిమాకు కొన్నిరోజుల ముందు నా పేరును, మతాన్ని మార్చుకున్నానని చెప్పాడు. ఎందుకో నా గతాన్ని, దిలీప్ కుమార్ అనే నా పేరును విపరీతంగా ద్వేషించేవాడినని, అదెందుకో నాకు ఇప్పటికీ తెలియదని అన్నాడు. బయోగ్రఫీ ఆఫ్ ఏఆర్ రెహమాన్ పుస్తకాన్ని ల్యాండ్మార్క్ అండ్ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ప్రచురించింది.

  ఎ. ఆర్. రెహమాన్ పేరుతో పేరుగాంచిన అల్లా రఖా రెహమాన్ ఒక ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు, స్వరకర్త, గాయకుడు, గీత రచయిత, నిర్మాత, సంగీతకారుడు. రెహమాన్ జన్మనామం ఎ. ఎస్. దిలీప్ కుమార్. తండ్రి నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న రెహమాన్ చిన్నతనంలో తండ్రి మరణంతో కుటుంబాన్ని పోషించడానికి పలువురు సంగీత దర్శకుల దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. వాణిజ్య ప్రకటనలకు సంగీతం సమకూర్చాడు. తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా చిత్రానికి కూర్చిన సంగీతంతో మంచి పేరు వచ్చింది. మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కింది.

  రెహమాన్ గీతాలు తూర్పుదేశాలకు చెందిన శాస్త్రీయ సంగీతాన్ని (ముఖ్యంగా భారతీయ శాస్త్రీయ సంగీతం) ప్రపంచ సంగీతం, ఎలక్ట్రానిక్ సంగీతం, సంప్రదాయ ఆర్కెస్ట్రా అరేంజ్మెంట్లనూ మేళవించే శైలికి పేరొందాయి. ఆయన పొందిన పురస్కారాల్లో రెండు ఆస్కార్ అవార్డులు, రెండు గ్రామీ పురస్కారాలు, ఒక బిఎఎఫ్‌టిఎ పురస్కారం, ఒక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు, నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, పదమూడు ఫిల్మ్ ఫేర్ సౌత్ పురస్కారాలు ఉన్నాయి.