ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ ప్రారంభం

  0
  4

  ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ‘ఫిట్ ఇండియా మూవ్‌మెంట్’ను మొదలు పెట్టింది.

  జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 29న ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ దేశంలో ప్రతీ ఒక్కరు ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఫిట్‌నెస్ అనేది సున్నా శాతం పెట్టుబడి పెడితే వంద శాతం ఫలితాలు ఇచ్చేదన్నారు.

  ఫిట్ ఇండియా మూవ్‌మెంట్‌ను నిరంతరాయంగా కొనసాగించేందుకు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో 28 మంది సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

  ఒక దేశం అభివృద్ధి చెందాలంటే… ఆ దేశంలో ప్రజలు ఫిట్‌గా ఉండాలి. కొడితే గోడలు బద్ధలైపోయేలా… బలంగా ఉండాలి. అప్పుడే రికార్డులు బద్ధలవుతాయి. సరికొత్త చరిత్ర లిఖించగలం. ఇదే స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోదీ… ఢిల్లీ ఇందిరాగాంధీ స్టేడియంలో ఫిట్ ఇండియా ప్రచారం ప్రారంభించారు. సాధారణంగా మనమంతా… ఫిట్‌గా ఉండటమనేది క్రీడాకారులు, సినిమా యాక్టర్లు, సెలబ్రిటీలకు సంబంధించిన వ్యవహారంగా భావిస్తుంటాం. నిజానికి ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలి. రోజూ వ్యాయామాలు, వాకింగ్, జాగింగ్ వంటివి చెయ్యాలి. ఒంట్లో అనవసరంగా ఉన్న కొవ్వు, అధిక బరువును తొలగించుకోవాలి. అందుకోసం ఉద్దేశించినదే ఫిట్ ఇండియా ఉద్యమం.