ప్రపంచంలోనే పేద్ద విమానం

  0
  8

  స్ట్రాటోలాంచ్‌కు ఇప్పటివరకూ నేల మీదే పరీక్షలు నిర్వహించారు. తొలిసారిగా శనివారం అమెరికాలోని మొజావీ ఎడారిపై ఇది గగనవిహారం చేసింది.

  విమానం పేరు: స్ట్రాటోలాంచ్‌
  వెడల్పు: ఫుట్‌బాల్‌ మైదానం కన్నా ఎక్కువ.
  రెక్కల విస్తీర్ణం: 117 మీటర్లు.
  ఇంజిన్లు: ఆరు, రెండు బాడీలు

  ప్రయోజనం: స్ట్రాటోలాంచ్‌ ఎగిరే లాంచ్‌ ప్యాడ్‌గా ఉపయోగపడుతుంది. కక్ష్యలోకి చౌకగా ఉపగ్రహాలను ప్రయోగించడానికి దీన్ని రూపొందించారు.

  ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన విమానం మొట్టమొదటిసారిగా గగనవిహారం చేసింది. ‘స్ట్రాటోలాంచ్‌’ అనే లోహ విహంగం అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి బయలుదేరింది. ప్రయోగం అద్భుతంగా సాగిందని విమాన పైలట్‌ ఎవాన్‌ థామస్‌ తెలిపారు.

  ఎందుకు?

  కక్ష్యలోకి చౌకలో ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఈ విమానాన్ని రూపొందించారు. ఉపగ్రహ ప్రయోగాల కోసం భూమి నుంచి నిట్టనిలువుగా నింగిలోకి దూసుకెళ్లే రాకెట్లను ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు.

  స్ట్రాటోలాంచ్‌ ఎగిరే లాంచ్‌ ప్యాడ్‌గా ఉపయోగపడుతుంది. ఇది ఉపగ్రహంతో కూడిన రాకెట్‌ను మోసుకొని నింగిలోకి మోసుకెళుతుంది. అందుకోసం లాంచ్‌ ప్యాడ్‌ అవసరంలేదు. పొడవైన రన్‌వే సరిపోతుంది.

  నేలమీద నుంచి 10 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నాక రాకెట్‌ను జారవిడిస్తుంది. ఆ వెంటనే అది ప్రజ్వలించి అంతరిక్షంలోకి దూసుకెళుతుంది. ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెడుతుంది.

  రెండున్నర గంటలపాటు…

  స్ట్రాటోలాంచ్‌కు ఇప్పటివరకూ నేల మీదే పరీక్షలు నిర్వహించారు. తొలిసారిగా శనివారం రెండున్నర గంటల పాటు మొజావీ ఎడారిపై అది గగనవిహారం చేసింది.

  ఈ సమయంలో ఈ విమానం గంటకు 304 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. 17వేల అడుగుల ఎత్తుకు చేరుకుంది.

  చౌక ప్రయోగాలపై కన్ను

  చిన్న ఉపగ్రహాలను ప్రయోగించే మార్కెట్‌లోకి ప్రవేశించాలన్న ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు పాల్‌ అలెన్‌ ఈ ప్రాజెక్టును చేపట్టారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆయన మరణించాక ఈ సంస్థ భవిత అనిశ్చితిలో పడిపోయింది. బ్రిటన్‌కు చెందిన బిలియనీర్‌ రిచర్డ్‌ బ్రాన్సన్‌ సంస్థ వర్జిన్‌ గెలాక్టిక్‌ కూడా ఇలాంటి అంతరిక్ష ప్రయోగ విమానాన్ని రూపొందించింది.

  రెండు బాడీలు

  స్కేల్డ్‌ కాంపోజిట్స్‌ అనే ఇంజినీరింగ్‌ కంపెనీ ఈ భారీ విమానాన్ని నిర్మించింది. దీనికి రెండు బాడీలు ఉంటాయి.

  ఈ విమానం వెడల్పు ఫుట్‌బాల్‌ మైదానం కన్నా పెద్దగా ఉంటుంది. రెక్కల విస్తీర్ణం 117 మీటర్ల మేర ఉంది. ఎయిర్‌బస్‌ ఎ380 రెక్క విస్తీర్ణం 80 మీటర్ల కన్నా తక్కువే ఉంటుంది.

  దీనికి ఏకంగా ఆరు ఇంజిన్లు ఉంటాయి.