పోలవరం‘రికార్డు’ మొదలు

  0
  12

  300 బ్లాకుల్లో ప్రారంభమైన కాంక్రీటు నింపే కార్యక్రమం
  24 గంటల్లో 30 వేల ఘ.మీ. కాంక్రీటు లక్ష్యం

   

  పోలవరం ప్రాజెక్టులో ప్రపంచ రికార్డు కాంక్రీటు పనులు ఆదివారం మొదలయ్యాయి. ఈ క్రమంలో భాగంగా ఆదివారం ఉదయం 8 గంటలకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు ఎడ్యుకేటర్‌ రిషిద్‌నాథ్‌ కాంక్రీటు పనులను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం భారీ స్థాయిలో కాంక్రీటు పనులు చేపట్టారు. 2017లో యూఏఈలో ఓ టవరు నిర్మాణంలో భాగంగా 24 గంటల్లో 21,580 ఘనపు మీటర్ల కాంక్రీటు వేశారు. ఆ రికార్డును అధిగమించేందుకు ఆదివారం ఉదయం ఇక్కడ పనులు ప్రారంభించారు. 30 వేల ఘనపు మీటర్ల కాంక్రీటు వేయడానికి 300 బ్లాకులను ముందుగానే సిద్ధం చేశారు.

  ఒక్కో బ్లాకులో 100 క్యూబిక్‌ మీటర్ల పరిమాణం కలిగిన కాంక్రీటు పడుతుంది. ఆ బ్లాకుల్లో ట్రాన్సిÆట్‌ మిక్సర్లుతో తెచ్చిన కాంక్రీటును వేశారు. ఇలా 300 బ్లాకులను 6 జోన్లుగా విభజించి ఇంజినీరింగ్‌ అధికారులకు అప్పగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించనున్నారు. రికార్డు వేగంతో సాగుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం పరిశీలిస్తారు. అక్కడే ప్రపంచ రికార్డును అధికారికంగా ప్రకటిస్తారు.

  అనేక రికార్డులను అధిగమించిన ‘పోలవరం’ సోమవారం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో తన స్థానాన్ని పదిల పరచుకోవడానికి సిద్ధమవుతోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు పనులు ప్రారంభం కాగా.. 9 గంటల వరకు తొలిగంటకు 1275 ఘ.మీ. కాంక్రీటు వేశారు. సోమవారం ఉదయం 8 గంటల వరకు ఈ పనులు చేపడతారు. ఆ తర్వాత గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు అధికారులు అవార్డు ప్రకటిస్తారు. 24 గంటలకు 30 వేల ఘనపు మీటర్ల కాంక్రీటు వేస్తారు. ఆపై కూడా పనులు కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం వరకు పనులు కొనసాగించి కాంక్రీటు వేయడం ద్వారా ఇప్పట్లో ఎవరూ ఈ రికార్డును అధిగమించకుండా ఉండేలా చేయాలనేది ప్రాజెక్టు అధికారుల ఆలోచన.