‘పీఎస్‌బీలోన్స్‌ఇన్‌59మినిట్స్‌.కామ్‌’ ద్వారా రూ.35,000 కోట్ల రుణాలు మంజూరు

  0
  12

  ఇప్పటివరకు ‘పీఎస్‌బీలోన్స్‌ఇన్‌59మినిట్స్‌.కామ్‌’ ద్వారా రూ.35,000 కోట్లకు పైగా రుణాలు మంజూరు.

  చిన్న, మధ్యస్థాయి సంస్థలకు గంటలోపే రుణం మంజూరు చేసేందుకు నెలకొల్పిన వెబ్‌సైట్‌ విజయవంతమైందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ క్రెడిట్‌ సూయిజ్‌ నివేదిక పేర్కొంది. మూడు నెలల క్రితం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన వెబ్‌ పోర్టల్‌ ‘పీఎస్‌బీలోన్స్‌ఇన్‌59మినిట్స్‌.కామ్‌’ ద్వారా ఇప్పటి వరకు రూ.35,000 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేసినట్లు తెలుస్తోంది.

  *దేశంలోనే అత్యధిక మొత్తంలో రుణాలు మంజూరు చేసిన ఆన్‌లైన్‌ రుణ వేదికగా దీనికి గుర్తింపు లభించింది. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థలకు (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు) రూ.1 కోటి వరకు రుణాల్ని కేవలం 59 నిముషాలు లేదా అంత కంటే తక్కువ సమయంలో మంజూరు చేసేలా ఈ వెబ్‌ పోర్టల్‌ను గత ఏడాది నవంబరులో అందుబాటులోకి తీసుకొచ్చారు.

  *బ్యాంకింగ్‌ వ్యవస్థను పారదర్శకంగా మార్చడంతో పాటు సమస్యలు లేని విధంగా తీర్చిదిద్దడం కోసం చేసిన ప్రయత్నంగా ప్రభుత్వం దీన్ని అభివర్ణించింది. ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలో దీన్ని రూపొందించారు.

  ఈ వెబ్‌ పోర్టల్‌ ప్రారంభమైన నాటి నుంచి ఫిబ్రవరి 27 వరకు
  * 1.62 లక్షల ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు రుణ మంజూరు కోసం సూత్రప్రాయ ఆమోదం లభించింది
  * 1.12 లక్షల సంస్థలకు రూ.35,065.46 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు సమాచారం.
  * 35,517 సంస్థలు.. రూ.10,047 కోట్ల మొత్తాన్ని కొత్తగా రుణంగా అందుకున్నాయి
  * 77,369 సంస్థలు.. రూ.25,609 కోట్లను రుణ పునరుద్ధరణ కింద పొందాయి.
  * రూ.27 లక్షలు.. కొత్తగా రుణం పొందిన సంస్థలు అందుకున్న సగటు మొత్తం
  * రూ.34 లక్షలు.. గతంలో రుణం పొంది, మళ్లీ తీసుకున్న సంస్థలు అందుకున్న సగటు మొత్తం