నైపుణ్యాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కు అగ్రస్థానం

  0
  17

  నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
  ఈ మేరకు ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో నవంబర్ 22న జరిగిన ‘గ్లోబల్ స్కిల్స్ సమ్మిట్’లో ఇండియా స్కిల్స్ నివేదిక-2019ను విడుదల చేశారు.

  ఈ నివేదిక ప్రకారం ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధిలో ఏపీ మొదటిస్థానంలో నిలవగా పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

  ఇండియా స్కిల్స్ నివేదిక ప్రకారం చురుకైన విద్యార్థులు కలిగిన నగరాలలో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా… చెన్నై, గుంటూరు, లఖ్నవ్, ముంబై, ఢిల్లీ, నాసిక్, పుణె వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అదేవిధంగా ఇంగ్లీషు, విశ్లేషణాత్మక ఆలోచనలు, లాజికల్ సమస్యలను పరిష్కరించడం, నడవడిక వంటి విషయాలలో ఏపీలోని గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం విద్యార్థులు ముందంజలో ఉన్నారు. ఏపీ యువతకు ఉద్యోగ కల్పన కోసం పలు అంతర్జాతీయ, జాతీయ ప్రఖ్యాత సంస్థలు ముందుకొస్తున్నాయి. రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ ఏటా 3 లక్షల మందికి నైపుణ్యభివృద్ధిలో శిక్షణను అందిస్తోంది. ఎంబీఏ కంటే ఇంజనీరింగ్ విద్యార్థులే రాష్ట్రంలో ఎక్కువగా, త్వరగా ఉద్యోగాలు పొందగలుగుతున్నారు.

  మరోవైపు నాలుగేళ్ల తర్వాత 2019లో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని ఇండియా స్కిల్స్ నివేదిక పేర్కొంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఆటోమోటివ్, ట్రావెల్, హాస్పిటాలిటీ రంగాలు ఉద్యోగ కల్పనలో కీలకంగా ఉండనున్నాయని వివరించింది. 2017తో ఫ్రెషర్స్ నియామకాలు 7 శాతంగా ఉండగా 2019లో 15 శాతానికి పెరుగుతాయంది. 2018లో మహిళా ఉద్యోగ కల్పన 38 శాతం నుంచి 46 శాతానికి పెరిగిందని, ఇదే సమయంలో పురుషు ఉద్యోగ కల్పన మాత్రం స్వల్పంగా 47 శాతం నుంచి 48 శాతానికి పెరిగిందని తెలిపింది.

  ఇండియా స్కిల్స్ నివేదిక-2019ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాల సంస్థ (యూఎన్డీపీ), ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీయూ), పీపుల్ సా్ర్టంగ్, సీఐఐ, వీ-బాక్స్ సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించి రూపొందించాయి.