భారతీయ సినిమా ఇతివృత్తం కాలానుగుణంగా మారుతోందని మోదీ అన్నారు. ముంబైలో ‘నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా’ ప్రారంభించిన అనంతరం పలువురు సినీ రంగ ప్రముఖులు హాజరైన సభనుద్దేశించి మాట్లాడారు.
నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్న డైలాగ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ముంబయిలో శనివారం ఈ మ్యూజియాన్ని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ‘జోష్ ఎలా ఉంది’ అని అడిగారు. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రయిక్స్’ సినిమాలోని డైలాగ్ అది. ఓ మేజర్ మరో జవానుతో ‘జోష్ ఎలా ఉంది’ అని అడుగుతారు. ఇందుకు సదరు జవాను ‘హై సర్’ అని సమాధానమిస్తారు. మోదీ ఆ డైలాగ్ చెప్పగానే కార్యక్రమానికి విచ్చేసిన సినీ ప్రముఖుల చప్పట్లతో మ్యూజియం మార్మోగిపోయింది. మోదీ డైలాగ్ విని ఆమిర్ ఖాన్ ‘హై సర్’ అని సమాధానమిచ్చారు.
భారతీయ సినిమా ఇతివృత్తం కాలానుగుణంగా మారుతోందని మోదీ అన్నారు. ‘సినిమాలు, సమాజం పరస్పర ప్రతిబింబాలు. గతంలో పేదరికం, అసహాయతనే ఎక్కువగా చూపేవారు. నేడు సమస్యలతోపాటు వాటికి పరిష్కారాలనూ చూపుతున్నారు. లక్షల్లో సమస్యలుంటే కోట్లాది పరిష్కారాలు చూపుతున్నారు’ అని అన్నారు. ఈ మ్యూజియంలో రెండో ప్రపంచ యుద్ధంలో మన వీరుల త్యాగాలను కళ్లకు కట్టే 30 గంటల నిడివి గల డిజిటైజ్డ్ ఫుటేజీ ఉందని వెల్లడించారు.
మోదీ ఆ డైలాగ్ చెబుతున్నప్పుడు రికార్డ్ అయిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మ్యూజియం ఆవిష్కరణ కార్యక్రమంలో సినీ ప్రముఖులు మనోజ్ కుమార్, ఆమిర్ ఖాన్, కంగనా రనౌత్, కరణ్ జోహార్, రోహిత్ శెట్టి, కంగనా రనౌత్, ఆనంద్ ఎల్రాయ్, పూనమ్ ధిల్లన్, బోనీ కపూర్ తదితరులు హాజరయ్యారు.