నింగికెగసిన జీఎస్‌ఎల్‌వీ- ఎఫ్‌11 – నిర్దేశిత కక్ష్యలో జీశాట్‌-7ఎ

  0
  15

  శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి బుధవారం సాయంత్రం జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌11 వాహకనౌక రోదసీలోకి విజయవంతంగా దూసుకుపోయింది.

   ఈ వాహకనౌక జీశాట్‌-7ఎ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో భూ అనువర్తిత బదిలీ కక్ష్యలో ప్రవేశ పెట్టింది. 26 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం జీఎస్‌ఎల్‌వీ వాహకనౌక సాయంత్రం సరిగ్గా 4.10 గంటలకు శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. సరిగ్గా 19.15 నిమిషాల తర్వాత 2,250 కిలోల బరువున్న జీశాట్‌-7ఎ ఉపగ్రహాన్ని కక్ష్యలో విడిచిపెట్టింది. అందులోని సౌర ఫలకాలు, యాంటెన్నాలు విచ్చుకున్నట్లు సంకేతాలందాయి. కర్ణాటకలోని హసన్‌లో ఉన్న మాస్టర్‌ కంట్రోల్‌ కేంద్రం జీశాట్‌-7ఎ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకుంది. రెండు మూడు రోజుల్లో ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండించి నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెడతారు. ఉపగ్రహంలోని ద్రవ అపోజీ మోటారును వివిద దశల్లో మండించి, కక్ష్యను పెంచుతారు.

  ఉపయోగాలు
  జీశాట్‌-7ఎ అడ్వాన్స్‌డ్‌ మిలిటరీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహంగా ఇస్రోవర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో కేయూ బ్యాండ్‌ కమ్యూనికేషన్‌ సాధనాలున్నాయి. వైమానిక దళానికి, రక్షణశాఖకు సేవలందించనుంది. విమానాల మధ్య కమ్యూనికేషన్‌ సేవలందించనుంది. అలాగే మిలిటరీకి కచ్చితమైన సమాచారం అందించనుంది.