దేశీయ నదీరవాణాకు శ్రీకారం

  0
  17

  గంగానది ద్వారా బెంగాల్‌ నుంచి యూపీకి సరకు – తొలి కంటైనర్‌కు స్వాగతం పలికిన ప్రధాని మోదీ.

  దేశీయ జల రవాణా చరిత్రలో నూతన శకం ఆవిష్కృతమయింది. నదీ మార్గాల్లో సరకును చౌకగా చేరవేయాలన్న సంకల్పం సోమవారం సాకారమయింది. స్వాతంత్య్రానంతరం ఇలాంటి సదుపాయం అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. కోల్‌కతా సమీపంలోని హల్దియాలో గంగానది జలాల్లో బయల్దేరిన సరకు రవాణా నౌక సోమవారం వారణాసికి చేరింది. ప్రధాని నరేంద్రమోదీ దీనిని లాంఛనంగా స్వాగతించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణాన తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో ‘మల్టీ మోడల్‌ టెర్మినల్‌’ సహా రూ.2413 కోట్ల అభివృద్ధి పనుల్ని ఆయన ప్రారంభించారు. నదుల్లో నౌకాయానం ద్వారా సరకు రవాణా చేయడానికి ఉద్దేశించిన మొట్టమొదటి టెర్మినల్‌ ఇది.

  నదీ రవాణా ఇలా…
  * ఇంతవరకు సముద్ర మార్గాల్లోనే సరకు రవాణా చేస్తుండగా దేశీయంగా ఉన్న నదీ మార్గాలనూ దానికి అనువుగా మలచుకోవాలని కేంద్ర సర్కారు ‘జలమార్గ్‌ వికాస్‌ పథకం’ తీసుకువచ్చింది.
  * మొత్తం వ్యయం: రూ.5369 కోట్లు.
  * కేంద్రం, ప్రపంచ బ్యాంకు చెరి సగం భరిస్తాయి.
  * హల్దియా (కోల్‌కతా)-వారణాసితో పాటు నాలుగు జాతీయ జల మార్గాలు అందుబాటులోకి రానున్నాయి.
  * ఒకేసారి 1500-2000 టన్నుల సరకును తెచ్చే నౌకల రాకపోకలకు వీలుగా వీటిని అభివృద్ధి చేస్తారు.
  * తక్కువ ఖర్చుతో, పర్యావరణ అనుకూల విధానంలో సరకు రవాణాను, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి నదీయానం ఉపయోగపడుతుంది.
  * వారణాసితో పాటు సాహిబ్‌గంజ్‌, హల్దియాల్లోనూ టెర్మినళ్లు ఏర్పాటు చేస్తారు.