త్రిపుల్ తలాక్‌కు లోక్‌సభ ఆమోదం

  0
  18

  సెలెక్ట్‌ కమిటీకి పంపాల్సిందేనన్న విపక్షాలు, లోక్‌సభ నుంచి వాకౌట్‌
  ఓటింగులో వీగిపోయిన ఒవైసీ సవరణలు

   

    ముస్లిం మహిళలకు న్యాయం చేకూర్చే ప్రయత్నాన్ని రాజకీయ ప్రామాణికాలతో బేరీజు వేయకూడదు. ఇరవై ఇస్లామిక్‌ దేశాల్లోనూ తలాక్‌పై నిషేధం ఉంది. భార్య, ఆమె సన్నిహిత బంధువులు మాత్రమే కేసు పెట్టవచ్చు. అందువల్ల చట్టం దుర్వినియోగమయ్యే అవకాశాలు లేవు. విపక్షాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నాకే తదనుగుణమైన సవరణలూ చేశాం.

  -రవిశంకర్‌ ప్రసాద్‌, కేంద్ర న్యాయశాఖ మంత్రి

  ఒకేసారి ముమ్మారు తలాక్‌ చెప్పి విడాకులిచ్చే పద్ధతిని నిషేధించే అత్యవసరాదేశం (ఆర్డినెన్సు) స్థానంలో ప్రవేశపెట్టిన బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం లభించింది. తక్షణ, ముమ్మారు తలాక్‌ చెప్పడం చట్ట విరుద్ధమని, అలా చేసిన భర్తకు మూడేళ్ల వరకు కారాగార శిక్ష విధించవచ్చని ‘ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2018’ పేర్కొంటోంది. ఇదివరకే లోక్‌సభ ఆమోదం తెలిపి, రాజ్యసభలో ఆమోదం కోసం నిరీక్షిస్తున్న బిల్లు స్థానంలో దీనిని కొత్తగా ప్రవేశపెట్టారు. చర్చ సందర్భంగా విపక్షాలు కొన్ని అభ్యంతరాలను లేవనెత్తాయి.

  ఈ ముసాయిదాను క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉన్నందున పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన సెలెక్ట్‌ కమిటీ పరిశీలనకు దీనిని పంపించాల్సిందేనని ఉమ్మడిగా డిమాండ్‌ చేశాయి. మహిళా సాధికారత మాట ఎలా ఉన్నా ముస్లిం పురుషుల్ని శిక్షించడమే ప్రభుత్వ ఉద్దేశమని తప్పుపట్టాయి. ప్రభుత్వం దీనిని తోసిపుచ్చడంతో కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, అన్నాడీఎంకే, ఆర్జేడీ వంటి విపక్షాలు వాకౌట్‌ చేశాయి.

  చివరకు ఓటింగులో 245 – 11 ఓట్ల వ్యత్యాసంతో బిల్లుకు ఆమోదం లభించింది. నిర్దిష్టంగా ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకోవాలనే ఉద్దేశమేదీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముస్లిం మహిళలకు న్యాయం చేకూర్చి, గౌరవాన్ని కల్పించాలనేదే బిల్లు వెనుక ప్రయత్నమని న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వివరించారు. వరకట్నాన్ని, సతి ఆచారాన్ని పార్లమెంటు నిషేధించగలిగినప్పుడు తక్షణ తలాక్‌నూ నిషేధించవచ్చని మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. బిల్లు ఏ మతానికీ వ్యతిరేకం కాదని మరో మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ చెప్పారు. తలాక్‌ పద్ధతి సామాజిక రుగ్మత అని, దానిని రద్దు చేయాల్సిందేనని అన్నారు.