తెలుగు సాహితీ వేత్త కపిలవాయి లింగమూర్తి కన్నుమూత

  0
  34

  ప్రముఖ కవి, రచయిత, సాహితీ పరిశోధకులు సాహితీ భీష్ముడు కపిలవాయి లింగమూర్తి (92) కన్నుమూశారు.
  అనారోగ్యం కారణంగా హైదరాబద్లో నవంబర్ 6న తుదిశ్వాస విడిచారు. 14వ ఏటనే కావ్య రచనకు శ్రీకారం చుట్టిన లింగమూర్తి తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలంలోని జీనుకుంటలో స్వర్ణకారులు వెంకటాచలం, మాణిక్యమ్మ దంపతులకు 1928, జనవరి 31న జన్మించారు.

   

  పాఠశాల విద్యను ఉర్దూ మాధ్యమంలో పూర్తిచేసిన ఆయన ఆంధ్ర సారస్వత పరిషత్ పరీక్షలు రాసి తెలుగులో విశారద ప్రమాణ పత్రాన్ని పొందారు. ఉస్మానియా నుంచి సాహిత్యంలో మాస్టర్స్ పట్టాను, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీని పూర్తిచేశారు. 1970లో నాగర్కర్నూల్ జాతీయ ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకుడిగా చేరారు. 1972లో పాలెం, శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఉపన్యాసకుడిగా బాధ్యతలు చేపట్టారు. పాలెం ఓరియంటల్ కళాశాలలో బోధన చేసి 1983లో ఉద్యోగ విరమణ చేశారు.

  కథ, సాహిత్య విమర్శ, స్థల పురాణాలు, గ్రామాల చరిత్ర, దేవాలయాల చరిత్ర, పద్యకావ్యాలు, వ్యాఖ్యానాలు, శతకాలు, కీర్తనలు తదితర ప్రక్రియలతో లింగమూర్తి సాహితీ సృజన చేశారు. దాదాపు 70 పుస్తకాలు రచించారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా తదితర విశ్వవిద్యాలయాల నుంచి కపిలవాయి సాహిత్యంపై 6 సిద్ధాంత గ్రంథాలు వెలువడ్డాయి.

  పుస్తకాల్లో కొన్ని..
  పండరినాథ విఠల శతకం, తిరుమలేశ శతకం, ఆర్య శతకం, ఛత్రపతి, దుర్గ, భర్గ శతకాలు, జినుకుంట రామబంటు శతకం, పరమహంస శతకం, పాలమూరు జిల్లా దేవాలయాల చరిత్ర, మామిళ్లపల్లి స్థల చరిత్ర, భైరవకోన క్షేత్ర మహత్యం, సోమేశ్వర మహత్యం, గద్వాల హనుమద్వచనాలు, సౌధశిఖరం, చక్రతీర్థ మహత్యం.

  పురస్కారాలు.. బిరుదులు..
  • 2014లో తెలంగాణ రాష్ట్ర ఉగాది విశిష్ట పురస్కారం
  • తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ (అందుకున్న తొలి వ్యక్తి)
  • తెలుగు యూనివర్సిటీ ప్రతిభా పురస్కారం
  • బ్రౌన్ సాహిత్య పురస్కారం, బూర్గుల ప్రతిభా పురస్కారం, నోరి నరసింహశాస్తి్ర పురస్కారం
  • బిరుదులు: కవితా కళానిధి, కవి కేసరి.