తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో శాసనసభ ఎన్నికలు

    0
    12

    తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో శాసనసభ ఎన్నికలు 2018 డిసెంబర్‌ 7న జరిగాయి. తెలంగాణలో సుమారు 69.1 శాతం పోలింగ్‌ నమోదయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

    తెలంగాణ శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఒక్క పోలింగ్‌ కేంద్రంలో కూడా రీపోలింగ్‌ నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తలేదు. సుమారు 69.1 శాతం పోలింగ్‌ నమోదయినట్లు శుక్రవారం రాత్రి 11.45 గంటల సమయంలో ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో 91.27 శాతం ఓటింగ్‌ నమోదయింది. అత్యల్ప పోలింగ్‌ రాజధాని పరిధిలోని మలక్‌పేటలో జరిగింది. ఇక్కడ కేవలం 40 శాతం మంది మాత్రమే ఓటేశారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు శుక్రవారం పోలింగ్‌ జరిగింది. ఈవీఎంలు మొరాయించటంతో సుమారు 60 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమయింది. రెండు వేలకు పైగా పోలింగ్‌ యంత్రాలను మార్చడంతో ఆ తర్వాత ఓటింగ్‌ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగింది.

    తమ సమస్యలు పరిష్కరించలేదంటూ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ప్రజలు పోలింగ్‌ను కొన్ని గంటల పాటు బహిష్కరించారు. అధికారుల జోక్యంతో ఆ ఓటర్లు ఓటేయడానికి అంగీకరించారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్‌ ముగిసింది. ఆయా నియోజకవర్గాల్లో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకుని ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.