తెలంగాణ కాబినెట్ విస్తరణ

  0
  6

  రాష్ట్రంలో మంత్రివర్గం సంపూర్ణంగా కొలువుతీరింది. కొత్త గవర్నర్‌ తమిళిసై ఆరుగురు నూతన మంత్రులతో ప్రమాణం చేయించారు.

  గత ప్రభుత్వంలో మంత్రులుగా కీలకంగా వ్యవహరించిన కేటీఆర్‌, హరీశ్‌రావులు కొత్తప్రభుత్వం ఏర్పడిన తొమ్మిదినెలలకు మళ్లీ మంత్రివర్గంలోకి వచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఇద్దరు మహిళలకు ఈ సారి చోటుదక్కడం విశేషం. పునర్‌వ్యవస్థీకరణతో పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు జరిగాయి. హరీశ్‌రావుకు ఆర్థికశాఖ, కేటీఆర్‌కు పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖలు దక్కాయి. మంత్రివర్గంలో మొత్తం 18 మందికి అవకాశం ఉండగా ఇప్పటివరకు 12 మంది మాత్రమే ఉన్నారు. ఆరుగురి ప్రమాణంతో మంత్రివర్గం సంపూర్ణంగా కొలువుదీరినట్లయింది. దీంతో పాలన ఇక పరుగులు తీస్తుందని భావిస్తున్నారు.

  తెలంగాణ కొత్త ఆర్థిక మంత్రిగా తన్నీరు హరీశ్‌రావుకు, పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రిగా కల్వకుంట్ల తారకరామారావుకు సీఎం కేసీఆర్‌ కీలక బాధ్యతలు అప్పగించారు. గతంలో నీటిపారుదల శాఖను నిర్వహించిన హరీశ్‌కు ఈసారి శాఖను మార్చగా… కేటీఆర్‌కు గతంలో నిర్వహించిన శాఖలను యథాతథంగా కొనసాగించారు. సాధారణ పరిపాలన, ప్రణాళిక, శాంతి భద్రతలు, నీటిపారుదల, రెవెన్యూ, మైనింగ్‌ శాఖలతో పాటు ఇతరులకు కేటాయించనివి సీఎం కేసీఆర్‌ దగ్గరే ఉన్నాయి.

  కొందరు మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు కూడా చేశారు. విద్యాశాఖను జగదీశ్‌ రెడ్డి నుంచి సబితారెడ్డికి, రవాణా శాఖను ప్రశాంత్‌రెడ్డి నుంచి అజయ్‌కు, కొప్పుల ఈశ్వర్‌ నుంచి బీసీ సంక్షేమ శాఖను, నిరంజన్‌రెడ్డి చూసిన పౌరసరఫరాల శాఖను గంగుల కమలాకర్‌కు అప్పగించారు. ఈశ్వర్‌ వద్దనున్న గిరిజన సంక్షేమశాఖను, మల్లారెడ్డి నిర్వహించిన మహిళా సంక్షేమ శాఖలను సత్యవతిరాఠోడ్‌కు అప్పగించారు.

  ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్దనున్న విద్యుత్‌ శాఖను జగదీశ్‌రెడ్డికి కేటాయించారు. అంతకుముందు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఆరుగురు ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు (సిరిసిల్ల), తన్నీరు హరీశ్‌రావు (సిద్దిపేట), పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), గంగుల కమలాకర్‌ (కరీంనగర్‌), పువ్వాడ అజయ్‌కుమార్‌ (ఖమ్మం), వరంగల్‌ ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్‌లతో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణం చేయించారు. ఆమె మాతృభాష తమిళం అయినప్పటికీ తెలుగులో ‘అనే నేను’ అంటూ ప్రమాణం చేయించారు.