తెలంగాణ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ – 2019-20

  0
  5

  రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను నేడు శాసనసభలో ప్రవేశపెట్టారు.

  2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,017 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్నెళ్ల కాలానికి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

  ఈ సారి బడ్జెట్‌లో కూడా సాగునీటి రంగానికే తొలిప్రాధాన్యం ఇస్తున్నారు. నీటిపారుదల రంగానికి రూ.25 వేల కోట్లను కేటాయించనున్నారు.

  రైతుబంధు పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎకరాకు ఏడాదికి రూ.8 వేలు ఇస్తుండగా ఈ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచిన నేపథ్యంలో ఈ సారి రూ.15 వేల కోట్ల మేర కేటాయింపులు ఉండనున్నాయి.

  వృద్ధాప్య, వితంతు పింఛన్లు రూ.1000 నుంచి రూ.2016కు, వికలాంగుల పింఛన్లను రూ.1500 నుంచి రూ.3016కు పెంచిన నేపథ్యంలో ఆసరా పింఛన్లకు ఈ సారి రూ.10 వేల కోట్లకు పైగా కేటాయింపులు దక్కనున్నాయి.

  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి నిధులను పెంచనున్నారు.

  ఉపకార వేతనాలు, గురుకుల విద్య, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లకు కేటాయింపులు పెంచారు. స్కాలర్‌షిప్‌లకు ఈ సారి రూ.3500 కోట్లకుపైగా కేటాయిస్తున్నట్లు తెలిసింది.

  గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, పట్టణాభివృద్ధికి గతంకంటే కేటాయింపులను పెంచింది.

   మొత్తం పన్నుల రాబడిలో వృద్ధి రేటును 19 శాతంగా అంచనా వేసిన ప్రభుత్వం రాష్ట్ర సొంత పన్ను రాబడుల్లో 29 శాతం వృద్ధి రేటుపై పూర్తి విశ్వాసంతో ఉంది. సొంత పన్నుల రాబడి, అమ్మకం పన్ను, జీఎస్టీ, ఎక్సైజ్‌రాబడి, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఆదాయం, మోటారు వాహనాల పన్ను రాబడిని నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో రూ.73 వేలకోట్లుగా అంచనా వేయగా ఈ సారి అది రూ.90 వేల కోట్లను దాటుతుందని ఆర్థికశాఖ అంచనా వేసింది.