తెలంగాణలో అన్నదాతల సమగ్ర సర్వే

    0
    10

    అన్నదాతల సమగ్ర సమాచారం సేకరణకు సన్నాహాలు, 25వ తేదీనుంచి ప్రారంభం కానున్న సర్వే ప్రక్రియ

     

    ఇప్పటికే కుటుంబ సమగ్ర సర్వే చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో సర్వేకు పూనుకుంది. రాష్ట్రంలో రైతులను ఆర్థికంగా పరిపుష్టి చేసేందుకు పంటల దిగుబడులను పెంచడమే లక్ష్యంగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పంటకాలనీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకుగాను ఈ నెల 25వ తేదీనుంచి నెలరోజుల పాటు రైతుల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించడానికి సమగ్ర సర్వే చేసేందుకు జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది.

    వ్యవసాయ విస్తరణాధికారులు గ్రామాల వారీగా ప్రతి రైతు నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరి స్తారు. జిల్లాలోని సుమారు 4లక్షల 60వేల 953మంది రైతుల నుంచి వారి సమగ్ర సమాచారం సేకరించేందుకు గాను వ్యవసాయ విస్తరణ అధికారులు సర్వే చేస్తారు.

    రైతుల సమగ్ర సర్వేలో భాగంగా అధికారులు మొత్తం 30కిపైగా రూపొందించిన అంశాల ఫార్మెట్‌ ప్రకారం పూర్తి వివరాలు సేకరిస్తారు. దీంట్లో భాగంగా రైతు వివరాలు, ఎంత భూమి ఉంది. ఏఏ పంటలను ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. వర్షాధారమా, ఆయకట్టా, లేక బోరుబావుల కింత సాగు చేస్తున్నారా.. ఆ రైతు పండించిన పంటల దిగుబడి ఎలా ఉంది.. ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందా లేదా అనే సమాచారం సేకరించి నమోదు చేసుకుంటారు.

    అదేవిధంగా రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుందా, మార్కెటింగ్, ప్రాసెసింగ్‌ సౌకర్యం ఉందా, ఆయా పంటలను పండిస్తే ఎంత గిట్టుబాటు అవుతుంది అనే వివరాలను తీసుకుంటారు. ఇంకా భూసారం, ఏఏ ఎరువులను, ఏఏ పంటలకు వాడుతున్నారు అనే సమాచారాన్ని సేకరిస్తారు.