తూర్పు ఆసియా దేశాల సదస్సులో పాల్గొన్న మోదీ

  0
  17

  సింగపూర్లో జరుగుతున్న 13వ తూర్పు ఆసియా దేశాల సదస్సు(ఈఏఎస్)లో ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 15న పాల్గొన్నారు.
  ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. వ్యూహాత్మక ఇండో-పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి తీర భద్రతలో సహకారం, వాణిజ్య వికేంద్రీకరణ కీలకమని చెప్పారు.

  మరోవైపు ఇండియా, సింగపూర్ సంయుక్తంగా నిర్వహించిన తొలి హ్యాకథాన్ విజేతల్ని మోదీ సత్కరించారు. 36 గంటల పాటు జరిగిన గ్రాండ్ ఫినాలేలో రెండు దేశాల నుంచి మూడేసి చొప్పున జట్లు ఈ పోటీలో గెలుపొందాయి. భారత్ నుంచి విజేతలుగా నిలిచిన జట్లలో ఐఐటీ ఖరగ్పూర్, ఎన్ఐటీ తిరుచ్చి, పుణే ఎంఐటీ ఇంజినీరింగ్ కాలేజ్ బృందాలున్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతం శాంతియుతంగా, సమ్మిళితంగా, సుసంపన్నంగా ఉండేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. సభ్య దేశాల మధ్య బహుళపాక్షిక సహకారం, ఆర్థిక-సాంస్కృతిక సంబంధాలు మరింతగా పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. గురువారం సింగపూర్లో జరిగిన 13వ తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు (ఈఏఎస్)లో ఆయన ప్రసంగించారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్సీఈపీ) ఒప్పందానికి, నౌకాయాన సహకారానికి కూడా భారత్ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.

  ఈ సమావేశానికి ముందు జపాన్ ప్రధాని షింజో అబె సహా పలువురు ఇతర దేశాల నేతలతో మోదీ సమాలోచనలు జరిపారు. ఆసియాన్ కూటమిలోని పది దేశాలతో పాటు భారత్ సహా మరో ఎనిమిది దేశాలు ఈఏఎస్లో భాగస్వాములుగా ఉన్నాయి. ప్రాంతీయంగా శాంతి, సుసంపన్నత, భద్రతలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ కూటమి ఆవిర్భవించింది. ‘ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్)- భారత్’ శిఖరాగ్ర సదస్సులోనూ మోదీ పాల్గొన్నారు. భారత్-సింగపూర్ తొలి హ్యాకథాన్లో విజేతలుగా నిలిచిన ఆరు బృందాలను ఆయన సత్కరించారు. వీటిలో మూడు బృందాలు (ఐఐటీ-ఖరగ్పుర్, ఎన్ఐటీ-తిరుచ్చి, ఎంఐటీ-పుణె) భారత్ నుంచి వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం, నవకల్పనలు, యువ శక్తిని చాటేందుకు ఈ పోటీలు ఒక వేదికగా నిలుస్తాయని మోదీ పేర్కొన్నారు. భారత్-సింగపూర్ మధ్య పరస్పర మార్పిడి కార్యక్రమం కింద సింగపూర్కు వచ్చిన ఎన్సీసీ కేడెట్లతో ఆయన కాసేపు ముచ్చటించారు.