తాజా వార్తలు

  0
  14

  విజయ్ హజారే ట్రోఫీ విజేతగా ముంబై.
  శ్రీలంక ప్రధానితో మోదీ భేటీ.
  క్రికెట్ నుంచి ప్రవీణ్ కుమార్ విరమణ.
  ఎకనామిక్స్ ఫోరం నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం.
  యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు 17వ స్థానం.

  * విజయ్ హజారే ట్రోఫీ విజేతగా ముంబై క్రికెట్ జట్టు నిలిచింది.

      బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అక్టోబర్ 20న జరిగిన ఫైనల్లో ముంబై 4 వికెట్ల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. దీంతో ముంబై ఓవరాల్‌గా ఈ ట్రోఫీని పదోసారి దక్కించుకున్నట్టయింది. ఈ ట్రోఫీలో ఆదిత్య తరే(ముంబై జట్టు)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది.

   

  * భారత పర్యటనలో ఉన్న శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేతో ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 20న భేటీ అయ్యారు.

     ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలతో పాటు పలు అంతర్జాతీయ సమస్యలపై చర్చించారు. అలాగే 2017 మేలో మోదీ శ్రీలంకకు వెళ్లిన సందర్భంగా ప్రకటించిన పలు ప్రాజెక్టులను ఇరు దేశాధినేతలు సమీక్షించారు.

   

  * భారత పేస్ బౌలర్ ప్రవీణ్ కుమార్ క్రికెట్ నుంచి విర మిస్తున్నట్లు అక్టోబర్ 20న ప్రకటించాడు.

     ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 32 ఏళ్ల ప్రవీణ్ 2007లో పాకిస్తాన్‌తో జైపూర్‌లో జరిగిన వన్డేతో అంతర్జాతీయ కెరీర్‌ను మొదలుపెట్టాడు. 2012 వరకు సాగిన ఆరేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 68 వన్డేలాడి 77 వికెట్లు పడగొట్టాడు. 10 టి20ల్లో 8, 6 టెస్టులాడి 27 వికెట్లు తీశాడు. ప్రవీణ్ అద్భుత ప్రదర్శనతోనే ఆస్ట్రేలియాలో 2008లో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ ‘కామన్వెల్త్ బ్యాంక్ ట్రోఫీ’ని భారత్ చేజిక్కించుకుంది.

   

  * తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావుకు వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం నుంచి మరోసారి ఆహ్వానం లభించింది.

     2019 జనవరి 22 నుంచి 25 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న 49వ వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరు కావాలని కేటీఆర్‌కు ఎకనామిక్స్ ఫోరమ్ అక్టోబర్ 21న ఆహ్వానం పంపింది. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి, డిజిటలైజేషన్, ఈఓడీబీ, ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ పాలనలో పారదర్శకత వంటి కీలక అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలుపరిచిన సంస్కరణలపై సదస్సులో ప్రసంగించాలని కేటీఆర్‌ను ఫోరం కోరింది.

   

  * అంచనాలకు మించి రాణించిన భారత క్రీడాకారులు యూత్ ఒలింపిక్స్‌లో తమ పోరాటాన్ని రజత పతకంతో ముగించారు

     పోటీల చివరిరోజు భారత్‌కు పురుషుల ఆర్చరీ వ్యక్తిగత రికర్వ్ విభాగంలో ఆకాశ్ మలిక్ రజతాన్ని అందించాడు. హరియాణాకు చెందిన 15 ఏళ్ల ఆకాశ్ ఫైనల్లో 0-6తో ట్రెన్‌టన్ కౌలెస్ (అమెరికా) చేతిల ఓడిపోయాడు. ఓవరాల్‌గా ఈ క్రీడల్లో భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, ఒక కాంస్యంతో కలిపి 13 పతకాలు సాధించి 17వ స్థానంలో నిలిచింది. 2010 క్రీడల్లో భారత్ 8 పతకాలతో 58వ స్థానంలో… 2014 క్రీడల్లో రెండు పతకాలతో 64వ స్థానంలో నిలిచింది. 2022 యూత్ ఒలింపిక్స్ సెనెగల్‌లో జరుగుతాయి.