ఢిల్లీ వాసుల ఆయుర్దాయం పదేళ్లు తగ్గుదల

    0
    14

    వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీవాసుల ఆయుర్దాయం పదేళ్లకుపైగా తగ్గిందని షికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది.

    ఈ మేరకు ఢిల్లీ వాయుకాలుష్యంపై రూపొందించిన నివేదికను నవంబర్ 19న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం… రెండు దశాబ్దాల కాలంలో 2016లో ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత దారుణస్థాయికి దిగజారింది. వాయుకాలుష్యం పెరిగి 1998తో పోల్చితే దేశంలో సూక్ష్మధూళి కణాలు ప్రస్తుతం సగటున 69 శాతం ఎక్కువయ్యాయి. దీంతో భారతీయుని ఆయుర్దాయం 4.3 సంవత్సరాలు తగ్గింది. దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ రెండోస్థానంలో ఉందని పాలసీ ఇన్స్టిట్యూట్ తెలిపింది. సాధారణ స్థాయిని మించి ప్రమాదకర స్థాయిలో ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతూనే ఉంది. నవంబర్8, 2017న ఇది మరింత ప్రమాదకర స్థాయికి చేరుకుందని యూఎస్ దౌత్య కార్యాలయం ప్రకటించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం 1,010స్థాయిలో ప్రమాద ఘంటికలను మోగిస్తున్నట్టు తెలిపింది. సాధారణంగా అయితే 0 నుంచి 100వరకు ఎక్కడైనా కాలుష్యం ఉంటుంది. కానీ ఢిల్లీలో 1,010స్థాయికి చేరుకోవడం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం.