డిజిటల్ పేమెంట్స్ కమిటీకి నందన్ నీలేకని చైర్మన్

  0
  8

  దేశంలో పేమెంట్స్ డిజిటైజేషన్ అంచనా కోసం ఆర్బీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీకి ఇన్ఫోసిస్ కోఫౌండర్ నందన్ నీలేకనిని చైర్మన్‌గా నియమించారు.

  ఈ కమిటీలో మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు. నీలేకని కాకుండా హెచ్‌ఆర్ ఖాన్, కిశోర్ సాన్సి, అరుణ శర్మ, సంజయ్ జైన్ ఈ కమిటీలో ఉన్నారు. ప్రస్తుతం దేశంలో డిజిటల్ పేమెంట్స్ పరిస్థితి ఎలా ఉంది.. వ్యవస్థలో ఉన్న లోపాలు, వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ సూచనలు చేయనుంది.

  డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించడానికి అత్యుత్తమ మార్గం ఏదన్నదానిపై ఇతర దేశాల్లోని విధానాలను కూడా ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. డిజిటల్ పేమెంట్స్‌లో భద్రతను పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా సిఫారసులు చేయడం కమిటీ బాధ్యత. కమిటీ సమావేశమైన 90 రోజుల్లో తన నివేదిక అందజేయాల్సి ఉంటుంది.

  డిజిటల్ పేమెంట్స్‌ కమిటీలో కేంద్ర ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు, విద్యా సంస్థలు, బ్యాంకింగ్ రంగాలకు సంబంధించి మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారని ఆర్‌బీఐ తెలిపింది. వీరిలో ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ హెచ్‌ఆర్ ఖాన్, సీఐఐఈ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ సంజయ్ జైన్, విజయా బ్యాంక్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కిశోర్ సన్సి, కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మాజీ కార్యదర్శి అరుణ శర్మ ఉన్నారు.