జూన్ 14 కరెంట్ అఫైర్స్ 2019

  0
  15

  # ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు
  # హెచ్‌ఎస్‌టీడీవీ విమాన పరీక్ష విజయవంతం
  # ఆధార్ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం

  ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు

  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ మటం వెంకటరమణ నియమితులయ్యారు.
  ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ జూన్ 12న నోటిఫికేషన్ జారీ చేసింది. వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 13కు చేరుకుంది. వీరిద్దరూ న్యాయాధికారుల కోటా నుంచి హైకోర్టు న్యాయమూర్తులయ్యారు. ఏపీ హైకోర్టులో మరో 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

  హెచ్‌ఎస్‌టీడీవీ విమాన పరీక్ష విజయవంతం

  హైపర్‌సోనిక్ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్ వెహికల్(హెచ్‌ఎస్‌టీడీవీ) అనే మానవరహిత విమానాన్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది.

  పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ స్క్రామ్‌జెట్ విమానాన్ని ఒడిశాలోని కలామ్ ద్వీపం నుంచి జూన్ 12న డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు ప్రయోగించారు. పునర్వినియోగ వాహనమైన హెచ్‌ఎస్‌టీడీవీతో ఉపగ్రహాలను చవకగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చు. హెచ్‌ఎస్‌టీడీవీ 20 సెకన్లలో 32.5 కి.మీ ఎత్తుకు చేరుకోగలదనీ, గంటకు 7,408 కి.మీ(6 మ్యాక్‌ల) వేగంతో దూసుకుపోగలదన్నారు. దీంతో శత్రుదేశాలపై క్రూయిజ్ క్షిపణులనూ ప్రయోగించవచ్చు.

  ఆధార్ సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం

  బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు, మొబైల్ ఫోన్ కనెక్షన్లు పొందేందుకు ఆధార్‌ను గుర్తింపు ధ్రువీకరణగా వాడుకునేందుకు వీలు కల్పిస్తూ రూపొందించిన ఆధార్ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ జూన్ 12న ఆమోదం తెలిపింది.

  2019, మార్చిలో విడుదల చేసిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన ఈ సవరణ బిల్లును జూన్ 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలను కూడా బిల్లులో ప్రతిపాదించింది. అదేవిధంగా, 18 ఏళ్లు నిండిన వారు బయోమెట్రిక్ గుర్తింపు విధానం నుంచి బయటికి వచ్చేందుకు వీలు కల్పించే ప్రతిపాదన కూడా ఉంది.