జీఎస్‌టీ వసూళ్లు@ లక్ష కోట్లు

  0
  11

  అక్టోబరులో జీఎస్‌టీ వసూళ్లు భారీ పెరుగుదలను నమోదు చేసుకున్నాయి. గత నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్లకు మార్క్‌కు చేరినట్లు కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ గురువారం ప్రకటించారు.

  సెప్టెంబరు నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ.94,442కోట్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్‌ తర్వాత మళ్లీ జీఎస్‌టీ వసూళ్లు రూ. లక్ష కోట్ల మార్క్‌ను చేరుకోవడం ఇదే. ఏప్రిల్‌ నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.03లక్ష కోట్లు వచ్చాయి. ఆ తర్వాత నుంచి రూ.90వేల కోట్ల స్థాయిలోనే వచ్చాయి.

  అక్టోబరు 2018 జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటాయి. తక్కువ వడ్డీ రేట్లు, పన్ను ఎగవేతలు జరగకుండా అధికారులు తీసుకుంటున్న చర్యల కారణంగా జీఎస్‌టీ వసూళ్లు పెరిగాయ్‌’ అని జైట్లీ ట్వీట్‌ చేశారు. సెప్టెంబరుతో పోల్చుకుంటే 6.64శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది. అక్టోబరులో వసూలైన రూ.1,00,710కోట్లలో కేంద్ర జీఎస్‌టీ రూ.16,464కోట్లు కాగా.. రాష్ట్రాల జీఎస్‌టీ రూ.22,826కోట్లు.. సమ్మిళిత జీఎస్‌టీ రూ.53,419కోట్ల(దిగుమతులపై వసూలైన రూ.26,908కోట్లు కలిపి), సెస్‌ కింద రూ.8000 కోట్లు(దిగుమతులపై వసూలైన రూ.955కోట్లు కలిపి) మేర ఉన్నాయి.

  సర్దుబాట్ల అనంతరం కేంద్ర జీఎస్‌టీ రూ.17,490కోట్లుగా కాగా.. రాష్ట్ర జీఎస్‌టీ రూ.15,107కోట్లుగా ఉంది. దేశంలో వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జీఎస్‌టీ కౌన్సిల్‌ 30 సార్లు సమావేశమైంది. రెండేళ్లలోనే 918 నిర్ణయాలు తీసుకుంది. పన్నుల భారం నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు కొన్ని వస్తువులను తక్కువ పన్ను శ్లాబులోకి తీసుకొచ్చింది.