చిన్న వ్యాపారులకు GST మినహాయింపు

    0
    3

    2019 జనవరి 10న డిల్లీలో జీఎస్‌టీ మండలి సమావేశం నిర్వహించారు. చిన్న వ్యాపారులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)లో మినహాయింపు ప్రకటించింది.

     ఖాతాలు, బిల్లుల రూపకల్పన నిమిత్తం వారికి ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ను కూడా అందించనుంది. పన్ను మినహాయింపు పరిధిలోకి వచ్చే వార్షిక టర్నోవర్‌, సంవిధాన పథకం (కాంపొజిషన్‌ స్కీం) విషయాల్లో మార్పులు చేసింది. ఈ నిర్ణయాలన్నీ 2019 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

    ప్రస్తుతం వార్షిక టర్నోవర్‌ రూ.20 లక్షలకు పైబడిన వారంతా జీఎస్‌టీ పరిధిలోకి వస్తున్నారు. ఇకపై ఆ పరిమితిని రూ.40 లక్షలకు పెంచారు. అంటే రూ.40 లక్షల వార్షిక టర్నోవర్‌ ఉన్న వ్యాపారులు ఎలాంటి జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదు. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ కూడా చేయించాల్సిన పనిలేదు. ఈశాన్య రాష్ట్రాలకయితే ప్రస్తుతం రూ.10 లక్షల టర్నోవర్‌ ఉన్నవారికి ఈ మినహాయింపులు ఉన్నాయి. అక్కడ ఈ పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు.

    ఒక రాష్ట్రం పరిధిలో జరిగే వ్యాపారానికే టర్నోవర్‌ పరిమితి పెంపు నిబంధన వర్తిస్తుంది. అంతర్రాష్ట్ర వ్యాపారం చేసే వారికి వర్తించబోదు. ప్రస్తుతం రూ.20 లక్షల టర్నోవర్‌ కన్నా తక్కువ ఉన్నప్పటికీ జీఎస్‌టీ చెల్లిస్తున్న 10.93 లక్షల మందికీ ఊరట కలగనుంది.

    టర్నోవర్‌ పరిమితిని పెంచడం కారణంగా రాష్ట్రాలు రూ.5,200 కోట్ల ఆదాయాన్ని కోల్పోవసి ఉంటుంది. అందువల్ల పరిమితిని పెంచాలా, వద్దా అన్న నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాలకు విడిచిపెట్టారు. టోర్నోవర్‌ పరిమితి పెంపు వల్ల పన్ను చెల్లించే వారి సంఖ్య తగ్గుతుందని, అందువల్ల ఆదాయాన్ని కోల్పోతామని కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

    సంవిధాన విధానాన్ని ఎంచుకున్న వ్యాపారులకు మూడు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి..ఏడాదికి ఒక రిటర్ను సమర్పిస్తే సరిపోతుంది. రెండు.. నెలనెలా కాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి పన్ను చెల్లించే వెసులుబాటు ఉంటుంది. మూడు…మిగిలిన పన్ను చెల్లింపుదారుల మాదిరిగా సవివరమైన ఫైల్స్ నిర్వహించవసిన అవసరం లేదు.

    వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన కేరళకు అదనంగా నిధులు సమీకరించుకోవడానికి జీఎస్‌టీ మండలి ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. అంతర్రాష్ట్ర వ్యాపారంపై 1 శాతం వైపరీత్యాల సెస్సు విధించుకునే అవకాశం ఇచ్చింది. రెండేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది.

    చిన్నవ్యాపారులంతా సంవిధాన పథకంలోకి…

    చిన్నవ్యాపారులంతా సంవిధాన పథకంలోకి వచ్చేలా జీఎస్‌టీ రెండు మార్పులు చేసింది.

    మొదటిది:
    ఈ పథకం కింద ప్రస్తుతం రూ.కోటి వార్షిక టర్నోవర్‌ ఉన్న చిన్న వ్యాపారులు 1 శాతం జీఎస్‌టీ చెల్లిస్తే సరిపోతుంది. ఈ టర్నోవర్‌ను రూ.1.5 కోట్లకు పెంచింది. పన్ను శాతంలో మార్పు చేయలేదు. వస్తువుల తయారీదార్లు, సరఫరాదార్లకు ఇది ఉపకరిస్తుంది. రూ.40 లక్షల వరకు మినహాయింపును ఉపయోగించుకోవడంతో పాటు, ఆ పైన ఉన్న టర్నోవర్‌కు 1 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది.

    రెండోది:  
    రూ.50 లక్షల వార్షిక టర్నోవర్‌ ఉన్న వస్తు, సేవల సర్వీసు ప్రొవైడర్లు, సరఫరాదారులు సంవిధాన విధానాన్ని ఎంచుకొని 6%పన్ను చెల్లిస్తే సరిపోతుంది. సేవల రంగంలో ఉన్నవారికి లుబ్ధి కలుగుతుంది.