చంద్రయాన్-2 ల్యాండర్ నమూనా పరీక్ష విజయవంతం

  0
  18

  ఇస్రో చేపట్టబోతున్న చంద్రయాన్-2 ప్రయోగంలోని ల్యాండర్ నమూనాపై జరిపిన చివరి పరీక్ష విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుడిపైకి ఆర్బిటార్, ల్యాండర్, రోవర్లను పంపేందుకు ఇస్రో సిద్ధమవుతుంది.

  చందమామ ఉపరితలంపై దిగే ఈ ల్యాండర్.. అక్కడ పలు పరీక్షల నిర్వహణలో కీలకం కానుంది.
  2022 కల్లా భారత్ తరపున తొలిసారి అంతరిక్షంలోకి మనిషిని పంపే ప్రయోగాన్ని పూర్తి చేస్తామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్ డాక్టర్ కె.శివన్ స్పష్టం చేశారు. తమ కలల ప్రాజెక్టు చంద్రయాన్-2ను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో దేశీయ వాహక నౌక ద్వారా చేపడతామని తెలిపారు. గోరఖ్పూర్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్నాతకోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. అంతరిక్షంలోకి మానవుడిని పంపే ప్రయోగానికి 2021 ఆఖరు లేదా 2022 ప్రారంభానికి గడువు విధించుకున్నామని చెప్పారు.
  ‘‘చంద్రుడి ఉపరితలంపై విస్తృతమైన పరిశోధనలు లక్ష్యంగా చంద్రయాన్-2 చేపడుతున్నాం. ఈ ప్రయోగం ద్వారా చంద్రుడిపైకి సులువుగా ల్యాండ్ అయ్యే ఉపగ్రహాన్ని పంపిస్తాం. రాబోయే ఆరు నెలల్లో పరిస్థితులను బట్టి మూడు నుంచి ఆరు ఇతర ప్రయోగాలు చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. దేశంలో కమ్యూనికేషన్, నావిగేషన్, అంతరిక్ష పరిజ్ఞానం వంటి రంగాలకు ఇస్రో సేవలందిస్తోంది. దేశంలోని ప్రతి ఒక్క వ్యక్తి ఇస్రో సేవలను వినియోగించుకుంటున్నాడు.’’ అని శివన్ అన్నారు.