గోవా సీఎంగా ప్రమోద్‌ సావంత్ ప్రమాణ స్వీకారం

  0
  9

  గోవా ముఖ్యమంత్రిగా భాజపా నేత, ప్రస్తుత స్పీకర్‌ ప్రమోద్‌ సావంత్‌ మర్చి 18న ప్రమాణ స్వీకారం చేశారు.

  పారికర్‌ క్యాబినెట్‌లో మంత్రులుగా ఉన్న 11 మంది సావంత్‌తో పాటు మళ్లీ మంత్రులుగా ప్రమాణం చేశారు.

  గోవాకు సావంత్‌ 13వ ముఖ్యమంత్రి.

  మిత్రపక్షాలైన గోవా ఫార్వర్డ్‌ పార్టీ(జీఎఫ్‌పీ) అధినేత విజయ్‌ సర్దేశాయ్‌, మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ(ఎంజీపీ) ఎమ్మెల్యే రామకృష్ణ ధవలికర్‌కు ఉపముఖ్యమంత్రి పదవులు దక్కాయి.

  ముఖ్యమంత్రిగా తనపై భాజపా పెద్ద బాధ్యతల్ని ఉంచిందని గోవా నూతన ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు. ‘‘పారికర్‌ భౌతికంగా మన మధ్య లేరు. ఈ నేపథ్యంలో పార్టీ, సంకీర్ణ పక్షాలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు నాపై పెద్ద బాధ్యతని ఉంచారు.

  మనోహర్‌ పారికర్‌ గొప్ప దార్శనికత కలిగిన వ్యక్తి. రాష్ట్రం, ప్రజల సంక్షేమం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కావాల్సినంత సమయం కేటాయిస్తా. నేను, నా బృందం కలిసి అంత్యోదయ లక్ష్యంతో.. ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా పనిచేస్తాం’’ అని ప్రమోద్‌ అన్నారు.

  సామాజికంగా వెనకబడిన వర్గాలు, యువత కోసం పారికర్‌ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని సావంత్‌ గుర్తుచేశారు. ఆయన అడుగుజాడల్లోనే మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. సీఎంగా సావంత్‌ బాధ్యతలు చేపడుతున్న సమయంలో ఆయన భార్య, గోవా భాజపా మహిళా విభాగం అధ్యక్షురాలు సులక్షణ సావంత్‌.. ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ప్రమోద్‌కు సీఎం బాధ్యతలు అప్పగించడంపై ఆమె భాజపాకు కృతజ్ఞతలు తెలిపారు. పారికర్‌ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తామని వ్యాఖ్యానించారు.