గోవాలో యుద్ధనౌకల నిర్మాణానికి భారత్, రష్యా ఒప్పందం

  0
  22

  రక్షణ రంగంలో భారత్, రష్యా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. గోవాలో తల్వార్ తరగతికి చెందిన రెండు యుద్ధ నౌకలను నిర్మించే ఒప్పందంపై ఇరుదేశాలు 2018 నవంబర్ 21న సంతకాలు చేశాయి.

  ఈ మేరకు రక్షణ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్, రష్యా ప్రభుత్వ రక్షణ పరికరాల ఉత్పత్తి సంస్థలు నవంబర్ 20న ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఒప్పందంలో భాగంగా భారత్‌లో 2 యుద్ధనౌకల నిర్మాణం కోసం జీఎస్‌ఎల్‌కు డిజైన్లు, సాంకేతికత, ఇతర పరికరాలను రష్యా సరఫరా చేస్తుంది.

  సుమారు రూ.3,600 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. 2020లో నిర్మాణ పను ప్రారంభమవుతాయి. 2026 నాటికి ఒక యుద్ధనౌక, 2027 నాటికి మరొకటి వినియోగానికి అందుబాటులోకి వస్తాయి.

  సింగపూర్ రక్షణ మంత్రితో నిర్మలా సమావేశం
  సింబెక్స్ నావికా విన్యాసాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సింగపూర్ రక్షణ మంత్రి ఎంగ్ ఇంగ్ హెన్తో భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖపట్నంలోని తూర్పు నావికాదళం ప్రధాన కేంద్రంలో నవంబర్ 20న సమావేశమయ్యారు.
  ఈ సమావేశంలో భారత్, సింగపూర్ రక్షణ బంధం మరింత దృఢమయ్యేందుకు దోహదపడే డిఫెన్స్ కో-ఆపరేషన్ అగ్రిమెంట్(డీసీఏ)పై ఇరుదేశాల రక్షణ మంత్రులు సంతకాలు చేశారు. పాతికేళ్ల ద్వైపాక్షిక బంధానికి ప్రతీకగా సింబెక్స్-2018 పేరుతో భారత్, సింగపూర్ దేశాలు విశాఖతీరంలో నావికా విన్యాసాలను నిర్వహించాయి.