గగన్‌యాన్ ప్రాజెక్టుకు ఆమోదం

  0
  10

  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మానవ సహిత యాత్ర ‘గగన్‌యాన్’ ప్రాజెక్టుకు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ డిసెంబర్ 28న ఆమోదముద్ర వేసింది.

  ఈ ప్రాజెక్టు కోసం రూ.10,000 కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించింది. గగన్‌యాన్ ద్వారా 2022నాటికి ముగ్గురు భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నారు. జీఎస్‌ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు.

  గగన్‌యాన్- ముఖ్యాంశాలు

  నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది.

  ప్రయోగంలో సాంకేతిక సాయం కోసం రష్యా, ఫ్రాన్స్ లతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంది.

  సంస్కృత పదం వ్యోమ్(అంటే అంతరిక్షం అని అర్థం) ఆధారంగా అంతరిక్షంలోకి వెళ్లే భారతీయులను ‘వ్యోమ్‌నాట్స్’ అని వ్యవహరిస్తారు.

  ఈ ప్రయోగం విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనాల తర్వాత సొంత పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి మానవుడిని విజయవంతంగా పంపిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది.

  చంద్రయాన్-1(2008), మంగళ్‌యాన్(2014) వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల తర్వాత ఇస్రో చేపడుతున్న కీలకమైన ప్రయోగం ఇదే.

  భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే 2022 నాటికి లేదా అంతకంటే ముందే సొంత సాంకేతిక పరిజ్ఞానంతో భారతీయుడిని అంతరిక్షంలోకి పంపుతామని 2018, ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.