కర్తార్ పుర్ కు ప్రత్యేక కారిడార్

    0
    3

    భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్ పుర్ సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు నవంబర్ 22న కేంద్రప్రభుత్వం తెలిపింది.

    పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లా డేరాబాబా నానక్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు ఈ కారిడార్ ను ఏర్పాటుచేయనున్నారు. ఈ కారిడార్కు నవంబర్ 26న రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ శంకుస్థాపన చేయనున్నారు.

    గురునానక్ 550వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కర్తార్పూర్ను భారత్ యాత్రికులు వీక్షించేందుకు వీలుగా సరిహద్దుల వద్దే శక్తివంతమైన టెలిస్కోప్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి స్పందనగా.. సరిహద్దు నుంచి గురుద్వారా వరకు తామూ కూడా కారిడార్ నిర్మిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దులకు పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలో 3 కి.మీ.ల దూరంలోనే కర్తార్ పుర్ సాహిబ్ ఉంది. సిక్కు మత స్థాపకుడు గురు నానక్ తుది శ్వాస విడిచిన ఇదేచోట తొలి గురుద్వారా ఏర్పాటైంది.

    కేబినెట్ కమిటీ మరికొన్ని నిర్ణయాలు…
    నవంబర్ 22న సమావేశమైన కేబినెట్ కమిటీ కర్తార్పూర్ కారిడార్ ఏర్పాటుతోపాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది.
    • చారిత్రక సుల్తాన్పూర్ లోధి వారసత్వ పట్టణంగా అభివృద్ధి. ‘హెరిటేజ్ కాంప్లెక్స్’ ఏర్పాటు. సుల్తాన్పూర్ లోధి రైల్వేస్టేషన్ స్థాయి పెంపు.
    • ఆరోగ్య సంరక్షణ అనుబంధ వృత్తుల ముసాయిదా బిల్లుకు ఆమోదం. ఆహార ధాన్యాలను ఇకపై తప్పనిసరిగా గన్నీ సంచుల్లో మాత్రమే ప్యాక్ చేయాలనే తీర్మానం వంటివి ఇందులో ఉన్నాయి.
    • ఓబీసీ కులాల వర్గీకరణ అంశంపై అధ్యయనం చేస్తున్న ఓబీసీ వర్గీకరణ కమిషన్ కాలపరిమితి 2019 మే 31 వరకు పెంపు.
    • ఆరోగ్య సంరక్షణ అనుబంధ సేవల ముసాయిదా బిల్లు-2018కు ఆమోదం. బిల్లు ద్వారా అత్యున్నత అలైడ్ అండ్ హెల్త్కేర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతోపాటు రాష్ట్రాల్లో స్టేట్ అలైడ్ అండ్ హెల్త్కేర్ కౌన్సిల్స్ ఏర్పాటవుతాయి. ఈ కౌన్సిళ్ల పరిధిలోకి ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించిన 15 ప్రధాన వృత్తి విభాగాలతోపాటు న్యూట్రిషనిస్ట్ వంటి 53 వృత్తులు వస్తాయి.
    • అన్ని రకాలైన ఆహార ధాన్యాలను ఇకపై జనపనార సంచుల్లో మాత్రమే ప్యాక్ చేయాలనే ప్రతిపాదనకు ఓకే. ఆహార ధాన్యాలను 100 శాతం, చక్కెరను 20 శాతం వరకు జనపనార సంచుల్లోనే తప్పనిసరిగా ప్యాక్ చేయాలి.