కంటి వెలుగు పరిపూర్ణం

  0
  15

  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం విజయవంతమైంది.ఏడున్నర నెలల పాటు సాగిన ఈ కార్యక్రమం గత నెలాఖరుతో పరిపూర్ణమైంది.

  రాష్ట్రంలోని 9,887 గ్రామాల్లో మొత్తంగా 1,54,71,769మందికి కంటిపరీక్షలు నిర్వహించడంతో లక్ష్యం వందశాతానికి చేరింది. రాష్ట్రంలో అత్యధికంగా ప్రజలు కంటి పరీక్షలు పొందిన జిల్లాల్లో హైదరాబాద్‌ (8,92,256) మొదటిస్థానంలో నిలవగా, రంగారెడ్డి (8,60,891), మేడ్చల్‌(8,28,822) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

  కేవలం దృష్టి లోపాలే కాకుండా కంటికి సంబంధించిన ఇతర సమస్యలనూ కంటి వెలుగులో పరీక్షించారు. మధుమేహం కారణంగా డయాబెటిక్‌ రెటినోపతి, కళ్లలో నీటికాసుల వ్యాధి తదితర వ్యాధులనూ గుర్తించారు. అవసరమైన వారికి ఔషధాలు ఇచ్చారు. మొత్తంగా 24,67,481 మందికి సాధారణ దృష్టిలోపాలను సరిచేసే కళ్లద్దాలు అవసరమని గుర్తించి, ఇందులో ఇప్పటివరకు 23,41,636 (94.9శాతం) మందికి కళ్లద్దాలను వారి స్వగ్రామాల్లోనే అందజేశారు.

  మొత్తం పరీక్షలు పొందినవారిలో ఈ తరహా కళ్లద్దాలు అవసరమైనవారు 15.9శాతం మంది ఉన్నారు. మాధ్యమిక స్థాయి ఆసుపత్రుల్లో 6,42,290 మందికి కంటి శుక్లాల శస్త్రచికిత్సలు అవసరమైనవారిని గుర్తించారు. ఇంత పెద్దఎత్తున రాష్ట్రవ్యాప్తంగా కంటి పరీక్షలు నిర్వహించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి.

  కంటి వెలుగు పథక ముఖ్యాంశాలు 

  • వైద్య బృందాలు: 827
  • మొత్తం పరీక్షలు పొందినవారు: 1,54,71,769 మంది.
  • ఒక్కో బృందం సగటున రోజుకు పరీక్షించింది: 188 మందిని.
  • ప్రత్యేకంగా చేయించిన కళ్లద్దాలు అవసరమైనవారు: 18,53,587 (మొత్తం పరీక్షలు పొందినవారిలో 12శాతం)
  • ప్రత్యేకంగా తయారు చేయించిన కళ్లద్దాల సరఫరా: 10,23,536 మందికి.
  • మొత్తం కంటి పరీక్షలు పొందినవారిలో శుక్లాల శస్త్రచికిత్సలు అవసరమైనవారు: 4.2శాతం
  • ఉన్నత స్థాయి కంటి శస్త్రచికిత్సలు అవసరమైనవారు: 3,16,976 (2శాతం).
  • ఏడున్నర నెలలపాటు కొనసాగిన కంటి వైద్యశిబిరాల్లో మొత్తంగా అన్నిరకాల కంటి సమస్యలున్నవారు 32.56శాతం మంది ఉండగా, ఎలాంటి కంటి సమస్యలు లేనివారు.. 1,04,33,899 (67.44శాతం) మంది ఉన్నట్లుగా గుర్తించారు.