ఐసీసీ ప్రపంచ కప్‌ అధికారిక స్పాన్సర్‌గా గోడాడీ

  0
  12

  2019 ఐసీసీ ప్రపంచ కప్‌ అధికారిక స్పాన్సర్‌గా ఇంటర్నెట్‌ డొమైన్‌ రిజిస్ట్రార్‌ గోడాడీ ఐఎన్‌సీ వ్యవహరించనుంది.

  కేవలం పురుషుల విభాగానికే ఇది స్పాన్సర్‌షిప్‌ తీసుకొంది. ఈ డీల్‌ విలువ 3 మిలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. ఈ స్పాన్సర్‌ షిప్‌ ద్వారా టోర్నమెంట్‌ జరిగే మైదానాల ప్రవేశద్వారాలు, సైడ్‌స్క్రీన్లు, బ్యాక్‌ డ్రాప్స్‌పై గోడాడీకి ప్రచారం లభిస్తుంది. దీంతోపాటు భారతీయ వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకొని మైదానంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనుంది. దీనిలో ఆన్‌లైన్‌ ద్వారా కలిగే ప్రయోజనాలను వారికి వెల్లడించనుంది.

  ‘‘ప్రపంచ కప్‌ అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రపంచలోని దాదాపు మూడింట రెండోంతుల మంది ఈ సమరాన్ని వీక్షిస్తారు. ముఖ్యంగా భారతీయులు దీనిని కచ్చితంగా చూస్తారు. మేము ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఎదగాలని లక్ష్యంగా పెట్టుకొన్నాం. భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగిం గణనీయంగా పెరిగింది. ఈ ప్రపంచకప్‌ను వేదికగా చేసుకొని ఆన్‌లైన్‌ ప్రయోజనాలను ప్రచారం చేస్తాము’’ అని గోడాడీ ఇండియా విభాగం ఎండీ, ఉపాధ్యక్షుడు నిఖిల్‌ అరోరా తెలిపారు.

  ‘‘మేము 2019 ప్రపంచ కప్‌ కోసం గోడాడీతో భాగస్వామి అయ్యాము. ప్రపంచవ్యాప్తంగా, భారత్‌లో క్రీడలను ప్రోత్సహించడంలో గోడాడీ చురుగ్గా ఉంది. మాతో భాగస్వామ్యంతో ఆ సంస్థ వ్యాపార లక్ష్యాలు నెరవేరతాయి. ఈ డీల్‌ ఇరుపక్షాలకు లాభదాయకంగా ఉంటుంది’’ అని ఐసీసీ వాణిజ్య విభాగం జనరల్‌ మేనేజర్‌ క్యాంప్‌బెల్‌ జామ్సన్‌ తెలిపారు. గోడాడీ ఇప్పటికే భారత క్రికెటర్‌ ఎం.ఎస్‌.ధోనీతో ఒప్పందం చేసుకొన్న సంగతి తెలిసిందే. ఐసీసీ ఇప్పటికే బి9 బేవరేజస్‌, నిస్సాన్‌ మోటార్‌, ఒప్పో, ఎంఆర్‌ఎఫ్‌,ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందాలు చేసుకొంది.

  భారత్‌ ఈ టోర్నమెంట్‌లో రాణించడంపైనే స్పాన్సర్‌ షిప్‌ సంస్థల లాభనష్టాలు ఆధారపడి ఉంటాయని ప్రముఖ క్రీడా మేనేజ్‌మెంట్‌ సంస్థ సీఈవో ఇంద్రనీల్‌ దాస్‌ బ్లాహ్‌ తెలిపారు.