ఐరాస భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్‌ మద్దతు

  0
  6

  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)లో భారత్‌ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇస్తున్నట్లు ఫ్రాన్స్‌ పునరుద్ఘాటించింది.

  సమితి సంస్కరణల్లో భాగంగా శాశ్వత, తాత్కాలిక సభ్యదేశాలను విస్తరించడం ‘మొదటి కీలక అధ్యాయం’గా పేర్కొంది.ఏప్రిల్‌ నుంచి 15 సభ్యదేశాల భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న జర్మనీ రాయబారి క్రిస్టోఫర్‌ హ్యూస్‌జెన్‌తో ఫ్రాన్స్‌ రాయబారి ఫ్రాంకోయిస్‌ డెలాట్రే మాట్లాడారు.

  ఇందులో భారత్‌, జర్మనీ, జపాన్‌లకు ఫ్రాన్స్‌ మద్దతు తెలిపింది. సమితిని విస్తరించి, ఆఫ్రికా దేశాలకు కూడా సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఫ్రాంకోయిస్‌ అభిప్రాయపడ్డారు.

  ఏషియన్‌ టైమ్స్‌తో సహా వివిధ అంతర్జాతీయ పత్రికలు, సంస్థలు చేసిన సర్వే ప్రకారం రానున్న మూడు లేదా నాలుగు సంవత్సరాలలో జనాభాలో భారత్‌ చైనాని అధిగమిస్తుంది. ఐరాసలోని భద్రతామండలిలో అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లకే శాశ్వత సభ్యత్వం ఉంది. ఈ దేశాలకి మాత్రమే వీటో అధికారం ఉంది. భద్రతా మండలి విస్తరించాలంటే ఈ ఐదు దేశాలు అంగీకరించాలి.

  సమితిలోని మొత్తం సభ్యదేశాల్లో 2/3 వంతు దేశాలు ఆమోదించాలి. భారత్‌తోపాటు బ్రెజిల్‌, జర్మనీ, జపాన్‌, ఆస్ట్రేలియా, నైజీరియా వంటి దేశాల వీటో అధికారం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఒకవేళ ఐరాస భద్రతా మండలి విస్తరణను చేపట్టినా భారత్‌కు వీటో అధికారం రాకుండా అడ్డుకునే శక్తులు చాలా ఉన్నాయి. చైనాతో పోటీ ఉండటం వలన అమెరికా, జపాన్‌కు మద్దతిచ్చే అవకాశం ఉంది. పాకిస్థాన్‌తో ఉన్న స్నేహం వల్ల చైనా మన అవకాశాలకు గండికొడుతుంది.

  బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు జర్మనీ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. రష్యా వైఖరి అస్పష్టంగా ఉంది. నెహ్రూ హయాంలో భారత్‌కు సోవియట్‌ యూనియన్‌తో మంచి సంబంధాలుండేవి. యూనియన్‌ విచ్ఛిన్నమైన తర్వాత సూపర్‌పవర్‌ హోదాని రష్యా కోల్పోయింది. రష్యాస్థానాన్ని చైనా అక్రమించింది. ఐరాసలో మొదట్నుంచి భారత్‌ కీలకపాత్ర పోషిస్తూనే ఉంది. భారత సైనిక దళాలు ఐక్యరాజ్యసమితిలో సేవలు అందిస్తూనే ఉన్నాయి.

  సార్క్‌ దేశాల కూటమిలో భారత్‌ పెద్దన్నగా వ్యవహరిస్తూనే ఉంది. తృతీయ ప్రపంచ దేశాలని (అలీనదేశాలు) కలపడంలో భారత్‌ కీలక పాత్ర పోషించింది. మనదేశం ఏనాడూ ఏ ఒక్క అంతర్జాతీయ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించలేదు. మనదేశం యు.ఎన్‌.ఓలో వీటో అధికారం పొందాలంటే మన ముందు రెండు మార్గాలున్నాయి. ప్రపంచదేశాల మద్దతుని కూడగట్టుకోవడం, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో బలమైన శక్తిగా ఎదగడం.