ఐఎంఎఫ్ చీఫ్‌గా గీతా గోపీనాథ్ బాధ్యతల స్వీకరణ

  0
  9

  అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ ఎకనమిస్టుగా ప్రముఖ ప్రవాస భారతీయ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ జనవరి 8న బాధ్యతలు స్వీకరించారు.

   

  భారత సంతతికి చెందిన మరో మహిళ ఉన్నత పదవిని అధిరోహించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) చీఫ్ ఎకనమిస్ట్‌గా 47 ఏళ్ల గీతా గోపీనాథ్ నియమితులయ్యారు. మైసూర్‌లో జన్మించిన గీతా గోపీనాథ్… ఐఎంఎఫ్‌లో ఉన్నత పదవి పొందిన తొలి మహిళగా రికార్డు సాధించారు. ఆమెకన్నా ముందు మౌరీ ఆస్ట్‌ఫెల్డ్ ఈ పదవిలో ఉన్నారు. మౌరీ ఆస్ట్‌ఫెల్డ్ డిసెంబర్ 31న పదవీ విరమణ చేయడంతో ఆ పదవిని గీతా గోపీనాథ్ చేపట్టారు.

  భారతదేశంలోని కోల్‌కతాలో పుట్టిన గీతా గోపీనాథ్ మైసూరులో పెరిగారు. ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ ఎకనమిక్స్‌లో ఎంఏ, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లో ఎంఏ, ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 2001లో యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.

  2005 నుంచి హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది అక్టోబర్ 1న ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ పదవికి ఆమె నియామకం ఖరారైంది. మేథో నాయకత్వం, విస్తృతమైన అంతర్జాతీయ అనుభవం ఆమె సొంతం. ఐఎంఎఫ్‌కు గీతా గోపీనాథ్ 11వ చీఫ్ ఎకనమిస్ట్.