ఉపాధి హామీ పథకం కూలీల కనీస వేతనం పెంపు

  0
  11

  ఉపాధి కూలి రూ. 6 పెంపు
  అనుమతి ఇస్తూనే ఆంక్షలు విధించిన ఈసీ
  పెంపుపై ప్రచారం కూడదని స్పష్టీకరణ

  ఉపాధి హామీ పథకం కూలీల కనీస వేతనం పెరిగింది. తెలంగాణలో ఉపాధి కూలీల ప్రస్తుత కనీస వేతనం రూ.205 కాగా.. ఇక ముందు అది రూ. 211 అవుతుంది. ఉపాధి కూలీలకు రోజువారీ వేతనాన్ని లెక్కగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే కనీస వేతనమే కొలబద్ద. రాష్ట్రాల వారీగా వ్యవసాయ కార్మికులు వినియోగించే వస్తువుల ధరల్ల్లోని తేడాల ఆధారంగా కేంద్రం దీనిని నిర్ధారిస్తుంది. అందుకే ఇది స్వల్ప తేడాలతో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో మాదిరిగా ఉంటుంది. తెలంగాణలో ఇది 2018-19లో రూ. 205 కాగా 2019-20లో మరో రూ. 6 పెరిగి రూ. 211 అవుతుంది.

  దేశమంతా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో కూలీ పెంపునకు అనుమతించాల్సిందిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఈసీని కోరింది. ఎన్నికల సంఘం పెంచుకోవచ్చని చెబుతూనే కోడ్‌ అమలులో ఉండడం వలన కొత్త వేతనంపై గ్రామీణాభివృద్ధి శాఖ ఎటువంటి ప్రచారం చేయకూడదని, రాజకీయ నాయకులు తమ ఎన్నికల ఉపన్యాసాల్లో దీనిపై ప్రచారం చేసుకోకూడదని ఆంక్షలు విధించింది.

  2018-19లో తెలంగాణలో కనీస వేతనం 205 అయినప్పటికీ ఇక్కడి కూలీల చేతికి అందిన సగటు వేతనం రూ. 148 మాత్రమే. అంటే ఇంకా బాగా కష్టపడితేనే తప్ప కేంద్రం ప్రకటించిన స్థాయిలో కనీస వేతనాన్ని ఇక్కడి కూలీలు పొందలేరు.

  కేంద్రం తాజా పెంపును 2018-19కు వర్తింపజేసినట్లైతే తెలంగాణలోని కూలీలకు సగటు వేతనం దాదాపుగా రూ. 150 నుంచి రూ. 152 మాత్రమే అవుతుంది. కొత్త కనీస వేతనం వల్ల 2019-20లో అదనంగా చేతికొచ్చేది చాలా స్వల్పమొత్తమే అయినప్పటికీ దానికీ ఎన్నికల సంఘం ఆంక్షలు విధించటం విశేషం.