ఇమిశాట్‌ ప్రయోగం విజయవంతము

  0
  24

  ఇస్రో పర్యవేక్షణలో నేడు శ్రీహరికోటలో జరిగిన ప్రయోగానికి చాలా ప్రాధాన్యం ఉంది. భారత్‌ నిఘా విభాగంలోకి సరికొత్త అస్త్రం వచ్చి చేరింది. అదే ‘ఇమిశాట్‌’. దీనిని ముద్దుగా ‘రాడార్‌ కిల్లర్‌’ అని కూడా పిలుస్తారు.

   నేడు ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ ద్వారా మూడు వేర్వేరు కక్ష్యల్లో భారత్‌తోపాటు విదేశాలకు చెందిన ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. ఒకే ప్రయోగం ద్వారా మూడు వేర్వేరు కక్ష్యల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం ఇస్రోకు ఇదే తొలిసారి.

  ఇక భారత్‌ ప్రవేశపెట్టిన ఇమిశాట్‌ను హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో ల్యాబ్‌లో అభివృద్ధి చేశారు. ఇజ్రాయిల్‌కు చెందిన నిఘా ఉపగ్రహం ఎస్‌ఏఆర్‌ఏఎల్‌ ప్రేరణతో దీనిని రూపొందించారు. అత్యంత పదునైన ఎలక్ట్రానిక్‌ నిఘా వ్యవస్థ దీనికి ఉంది. ఇది శత్రుదేశాల రాడార్లపై నిఘా పెడుతుంది.

  ప్రాజెక్టు కౌటిల్యా కింద దీనిని అభివృద్ధి చేశారు. భారత్‌కు చెందిన ఐఎంఎస్‌ ప్లాట్‌ఫామ్‌పై దీనిని సిద్ధం చేశారు. ఇది 436 కిలోల బరువు ఉంది. దీనిలో డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్‌ స్పెక్ట్రమ్‌ పరికరాన్ని అమర్చారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ. 432కోట్లు వెచ్చించినట్లు సమాచారం. 749 కిలోమీటర్ల పైన సన్‌సింక్రోనస్‌ ఆర్బిట్‌లోకి చేర్చిన ఈ శాటిలైట్ 8ఏళ్ల పాటు పనిచేస్తుంది.

  రక్షణ రంగంలోకి ఉపయోగించే ఉపగ్రహాల సమాచారాన్ని పూర్తిస్థాయిలో వెల్లడించరు. కానీ దీనికి ఉన్న ప్రాథమిక లక్షణాలను బట్టి ఈ శాటిలైట్‌ రేడియో సంకేతాలను పసిగట్టగలదు. ఇది రాడార్‌ నెట్‌వర్క్‌పై ఓ కన్నేసి పెడుతుంది. శత్రుదేశాలు ఎక్కడెక్కడా రాడార్లను అమర్చారో గుర్తించి సమాచారం అందజేస్తుంది. శత్రుదేశాల భౌగోళిక పరిస్థితులకు సంబంధించిన పూర్తి సమాచారం , చిత్రాలను అందజేస్తుంది.

  గతంలో ఈ పనిచేయడానికి డ్రోన్లు , బెలూన్లను ఉపయోగించేవారు కానీ ఇప్పుడు ఇమిశాట్‌ రాకతో 24గంటలు నిఘావేసే అవకాశం దక్కుతుంది. యుద్ధ సమయంలో ఏ దేశమైన తొలుత శత్రుదేశాల కమ్యూనికేషన్‌ స్థావరాలను, వ్యవస్థలను దెబ్బతీస్తుంది. అప్పుడు శత్రువు చుట్టు అంధకారం నెలకొంటుంది.

  సరైన లక్ష్యాలు తెలియకుండా దాడి చేయడానికి శత్రవుకు అవకాశం ఉండదు. అందుకే ముందుగా శత్రువుల కమ్యూనికేషన్‌ స్థావరాలు, రాడార్‌ వ్యవస్థలను గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇమిశాట్‌ చేసేది అదే. ఇప్పటికే ఆత్మాహుతి ‘హరూప్‌’ డ్రోన్లను భారత్‌ కొనుగోలు చేస్తోంది.