ఇఫ్లూకి 60 వసంతాలు

    0
    12

    ఆంగ్లభాష అవసరాలను దృష్టిలో పెట్టుకొని దేశంలోనే ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో నెలకొల్పిన ఆంగ్ల, విదేశీ భాషల విశ్వవిద్యాలయం (ఇఫ్లూ) అరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

    ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలు పదుల సంఖ్యలో ఉన్నా ఆంగ్ల, విదేశీ భాషల కోసం మాత్రమే ఉన్న ఒకే ఒక వర్సిటీ ఇది. 1958లోనే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ కేంద్రాన్ని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉద్యోగులకు వివిధ దేశాల అధికారిక భాషలను నేర్పించేందుకు దీన్ని మరింత విస్తరించారు. నాడు ఏర్పాటు చేసిన ముద్రణ కేంద్రం ఇప్పటికీ సేవలందిస్తోంది. రేడియో ద్వారా కూడా ఇఫ్లూ పాఠాలను బోధించింది. 1972లో దీన్ని సెంటర్ ఫర్ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ (సీఐఈఎఫ్ఎల్)గా మార్చారు. దీని ద్వారా ప్రధానంగా జర్మన్, రష్యన్, ఫ్రెంచ్ భాషలను నేర్పుతారు. 2007లో పార్లమెంట్ చట్టం ద్వారా ఇఫ్లూ (ఇంగ్లిష్, విదేశీభాషల విశ్వవిద్యాలయం)గా రూపాంతరం చెందింది. ఈ నెల 16న వజ్రోత్సవాల నిర్వహణకు సిద్ధమైంది.

    ఇఫ్లూలో 7స్కూళ్లు, 26 విభాగాలు ఉన్నాయి. వీటిలో గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్, పరిశోధన, డిప్లొమా, స్వల్పకాల విదేశీ భాషల కోర్సులను అందిస్తున్నారు. సుమారు 80 దేశాల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇఫ్లూకి వస్తుంటారు. షిల్లాంగ్, లక్నోల్లో ప్రాంతీయ కేంద్రాలున్నాయి. కంబోడియా, మయన్మార్, శ్రీలంక, లావోస్, వియత్నాంలలో ఆంగ్ల భాష కేంద్రాలను ప్రారంభించింది. తాజాగా సూడాన్, టోగో, జిబౌటి, మౌరిటానియాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఇఫ్లూ ఉపకులపతి ఆచార్య ఇ.సురేష్కుమార్ ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఆంగ్లభాష ఉచ్ఛారణకు సంబంధించి ఆధునిక హంగులతో యాప్ను సిద్ధం చేసింది. ‘స్వయం మూక్స్’లో రెండు కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విద్యాసంవత్సరం నుంచి మరో 3కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.