ఇటీవలి జరిగిన క్రీడల ముఖ్యమైన అంశాలు

  0
  14

  * ఎఫ్‌ఐహెచ్ ఉత్తమ ఆటగాడిగా అర్తుర్ వాన్ డొరెన్
  * సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ విజేతగా సైనా
  * గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జాతీయ రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌ ప్రారంభo
  * ఇరానీ కప్ విజేత విదర్భ

  ఎఫ్‌ఐహెచ్ ఉత్తమ ఆటగాడిగా అర్తుర్ వాన్ డొరెన్

  అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ఉత్తమ ఆటగాడిగా ప్రపంచ చాంపియన్ బెల్జియంకు చెందిన డిఫెండర్ అర్తుర్ వాన్ డొరెన్ వరుసగా రెండో ఏడాది ఎంపికయ్యాడు.

  ఈ మేరకు 2018 సంవత్సర పురస్కారాలను ఫిబ్రవరి 14న ఎఫ్‌ఐహెచ్ ప్రకటించింది. మహిళల విభాగంలో నెదర్లాండ్స్ క్రీడాకారిణి ఎవా డి గొయిడె (29) ఉత్తమ క్రిడాకారిణిగా నిలిచింది. అలాగే గోల్ కీపర్ విన్సెంట్ వనాచ్ ఉత్తమ గోల్ కీపర్‌గా, అర్తుర్ డి స్లూవర్ ఉత్తమ వర్ధమాన ఆటగాడిగా, బెల్జియం హెడ్ కోచ్ షేన్ మెక్ లాయిడ్ ఉత్తమ కోచ్‌గా నిలిచారు. 1998 నుంచి ప్రకటిస్తున్న ఎఫ్‌ఐహెచ్ అవార్డుల్లో ఇప్పటివరకు ఒక్క అవార్డు భారత్‌కు లభించలేదు.

  సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ విజేతగా సైనా

  జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ విజేతగా పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) తరఫున బరిలోకి దిగిన సైనా నెహ్వాల్ నిలిచింది.

  అస్సాంలోని గువాహటిలో ఫిబ్రవరి 16న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ సైనా 21-18, 21-15తో టాప్ సీడ్ పీవీ సింధు (ఆంధ్రప్రదేశ్)పై విజయం సాధించింది. గత జాతీయ చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ సింధునే ఓడించి సైనా టైటిల్ నెగ్గింది. ఓవరాల్‌గా జాతీయ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గడం సైనాకిది నాలుగోసారి. గతంలో ఆమె 2006, 2007, 2017లలో విజేతగా నిలిచింది.

  మరోవైపు పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సౌరభ్ వర్మ (పీఎస్‌పీబీ) గెలుచుకున్నాడు. ఫైనల్లో సౌరభ్ వర్మ 21-18, 21-13తో ఆసియా జూనియర్ చాంపియన్, 17 ఏళ్ల లక్ష్య సేన్ (ఎయిర్‌పోర్‌‌ట్స అథారిటీ ఆఫ్ ఇండియా)పై గెలుపొందాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన సౌరభ్ వర్మ జాతీయ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించడం ఇది మూడోసారి. గతంలో అతను 2011, 2017లలో గెలిచాడు.

  గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జాతీయ రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌ ప్రారంభo

  జాతీయ రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌కు తెర లేచింది. ఫిబ్రవరి 16 న గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఈ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు పోటీల్లో సబ్‌ జూనియర్‌ (అండర్‌-10), అండర్‌-12 విభాగాల్లో 3 రొటేషన్స్‌ విన్యాసాలు పూర్తయ్యాయి. సీనియర్స్‌ (15 ఏళ్లపైన) విభాగంలోనూ ఫైనల్‌ పోటీలు జరిగాయి.

  అంతకుముందు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి బి.వెంకటేశం ఈ పోటీలను ప్రారంభించారు.
  తెలంగాణ స్పోర్ట్స్‌ ఆథారిటీ ఛైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో మొదటిసారి నిర్వహిస్తున్న ఈ పోటీలకు దేశవ్యాప్తంగా వివిధ నగరాల నుంచి 65 మంది క్రీడాకారులు హాజరైనట్లు చెప్పారు.

  ఇరానీ కప్ విజేత విదర్భ

  వరుసగా రెండోసారి రంజీ ట్రోఫీ సాధించిన విధర్భ జట్టు ఇరానీ కప్‌ను కూడా సొంతం చేసుకుంది.

  నాగ్‌పూర్‌లో విదర్భ, రెస్టాఫ్ ఇండియా మధ్య జరిగిన ఐదు రోజుల మ్యాచ్ ‘డ్రా’ అయింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో పాటు గెలుపు వాకిట ఉన్న విదర్భతో ఇక చేసేదేమీ లేక రెస్టాఫ్ ఆటగాళ్లు చేతులు కలిపారు. ఇక విజయం ఖాయం కావడంతో ముందుగానే ఆటను ముగించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఇరానీ కప్ విదర్భ వశమైంది.