ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2018 (ఐఎంసీ) న్యూఢిల్లీలో అక్టోబర్ 25న ప్రారంభమైంది.

  0
  11

  ఐఎంసీ ప్రారంభ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, వొడాఫోన్ ఐడియా చైర్మన్ కూమార్ మంగళం బిర్లా పాల్గొన్నారు.

  బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగంలో ప్రస్తుతం 135వ స్థానంలో ఉన్న భారత్‌ త్వరలో టాప్‌ 3 దేశాల్లో ఒకటిగా ఎదగగలదని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చెప్పారు. రిలయన్స్‌ జియో ఫైబర్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు ఇందుకు తోడ్పడగలవని తెలిపారు. మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగంలో 155వ స్థానంలో ఉన్న భారత్‌ను కేవలం రెండేళ్ల వ్యవధిలోనే జియో అగ్రస్థానంలో నిలబెట్టిందని గురువారం ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ 2018 (ఐఎంసీ) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముకేశ్‌ అంబానీ చెప్పారు.

  ‘ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత వేగంగా 2జీ/3జీ నుంచి 4జీకి మారడం జరగలేదు. 2020 నాటికల్లా భారత్‌ పూర్తి స్థాయిలో 4జీ దేశంగా ఎదుగుతుంది. అప్పటికల్లా అన్ని ఫోన్లలోనూ 4జీ, ప్రతీ కస్టమర్‌కి 4జీ కనెక్టివిటీ ఉంటుంది. 5జీ టెక్నాలజీ సన్నద్ధతలో మిగతా దేశాలన్నింటికన్నా ముందు ఉంటుందని ధీమాగా చెప్పగలను‘ అని ఆయన పేర్కొన్నారు.

  2016లో చౌక డేటా చార్జీలతో టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో తాజాగా అల్ట్రా–హై స్పీడ్‌ ఫైబర్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ఫిక్స్‌డ్, మొబైల్‌ ఇంటర్నెట్‌ మధ్య హద్దులు చెరిపేసేలా జియోగిగాఫైబర్‌ సర్వీసులు ఉంటాయని ముకేశ్‌ అంబానీ తెలిపారు. ‘ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ విషయంలో ప్రస్తుతం 135వ స్థానంలో ఉన్న భారత్‌.. ప్రపంచం ఆశ్చర్యపోయేంత వేగంగా టాప్‌ 3 దేశాల్లో ఒకటిగా ఎదుగుతుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను‘ అని ఆయన పేర్కొన్నారు.