ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ శక్తికాంత దాస్‌

    0
    12

    ఆర్‌బీఐ కొత్త గవర్నరుగా శక్తికాంత దాస్‌ను ప్రభుత్వం నియమించింది. ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానంలో దాస్‌ను నియమిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది.

     మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఉర్జిత్‌ రాజీనామా అనంతరం తొలుత తాత్కాలికంగా ఎవరినైనా ప్రభుత్వం గవర్నరుగా నియమిస్తుందేమోనని అందరూ భావించారు. కాని అలా కాకుండా కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే శక్తికాంత్‌ దాస్‌ను ఎంపిక చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని నియామకాల మంత్రివర్గ కమిటీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరోవైపు ఉర్జిత్‌ రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ట్వీట్‌ చేశారు.

    శక్తికాంత్‌ దాస్‌ 1980 బ్యాచ్‌ తమిళనాడు కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. శక్తికాంత్‌ దాస్‌ దిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీలో హిస్టరీలో డిగ్రీ పట్టా అందుకున్నారు. హిస్టరీలో డిగ్రీ చేసినప్పటికీ తన 37 ఏళ్ల సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో ఆర్థిక శాఖ విభాగాల్లోనే ఎక్కువ కాలం పనిచేయడం గమనార్హం. 2014లో భాజపా నేతృత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రెవెన్యూ విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆర్‌బీఐ సంబంధిత విషయాలు, పరపతి విధాన వ్యవహారాలు చూసుకూనే ఆర్థిక వ్యవహారాల విభాగానికి కార్యదర్శి అయ్యారు. 2017 మేలో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా దాస్‌ను ప్రభుత్వం నియమించింది. జీ-20 దేశాల సదస్సులో భారత్‌ తరపు ప్రతినిధిగా కూడా ఆయనను ఎంపిక చేసింది. ఇప్పుడు ఆర్‌బీఐ 25వ గవర్నరుగా దాస్‌కు బాధ్యతలు అప్పగించింది.