ఆధార్‌ చట్టానికి సవరణల దిశగా ప్రభుత్వం

  0
  7

  గత సెప్టెంబరులో ఆధార్‌ వాడకంపై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొన్ని మార్పులు సూచించిన సంగతి తెలిసిందే. ప్రైవేటు సంస్థలు ఆధార్‌ డేటాను వినియోగించుకోవడం రాజ్యాంగ బద్ధం కాదని తీర్పు సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆధార్‌ చట్టాన్ని సవరించే ప్రతిపాదనలపై ప్రభుత్వం తుది కసరత్తులు చేస్తోంది.

  దీని ప్రకారం తమ ఆధార్‌ సంఖ్య, బయోమెట్రిక్‌ వంటి ఇతర వివరాలను గతంలో ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన పౌరులు ఆ వివరాలను వారి నుంచి ఉపసంహరించుకొనే వెసులుబాటుపై ప్రతిపాదన చేసింది. ‘‘సవరణలకు సంబంధించి ప్రాథమిక ప్రతిపాదనలను భారత విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) రూపొందించింది. 18 ఏళ్ల వయసు దాటినవారికి అంతకుముందు ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన ఆధార్‌ వివరాలను ఉపసంహరించుకొనేందుకు ఆరు నెలల సమయం ఇవ్వాలని యూఐడీఏఐ ప్రతిపాదించింది’’ అని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.

  ఈ ప్రతిపాదనను న్యాయశాఖ పరిశీలనకు పంపగా.. ‘‘ఆధార్‌ వివరాలను ఉపసంహరించుకొనే వెసులుబాటు కొన్ని వర్గాల ప్రజలకే పరిమితం చేయకుండా పౌరులందరికీ ఈ అవకాశం కల్పించాలని న్యాయశాఖ సూచించింది.’’ అని ప్రభుత్వాధికారి వెల్లడించారు. అనంతరం ఈ దస్త్రం మంత్రివర్గ పరిశీలనకు వెళ్లనుంది.

  ప్రైవేటు సంస్థలు ఆధార్‌ డేటా ఉపయోగించుకొనేందుకు వీలు కల్పిస్తోన్న ఆధార్‌ చట్టంలోని సెక్షన్‌ 57ను కొట్టేయాలని గత సెప్టెంబరులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సూచించింది. బ్యాంకు ఖాతాలు, సిమ్‌ కార్డులకు ఆధార్‌ సంఖ్యను అనుసంధానించడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు సమయంలో ధర్మాసనం పేర్కొంది. అయితే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)కు ఆధార్‌ అనుసంధానాన్ని సమర్థించింది.