ఆంధ్ర ప్రదేశ్ లో 20న భూధార్ కి శ్రీకారం

  0
  17

  జియోకోర్డినేట్స్ నిర్ధరణకు ‘కోర్స్’ సాంకేతికత
  పురపాలికల్లో ఆస్తి పన్ను పెంచవద్దు
  కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

  రాష్ట్రంలో భూధార్ ప్రాజెక్టుని నవంబరు 20న అధికారికంగా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వచ్చే నెల పది నాటికి అన్ని జిల్లాల్లో వ్యవసాయ భూములు, మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలోని భూమి రికార్డుల వివరాలు 90శాతానికి పైగా ఆన్లైన్లో నమోదుచేయాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్నులు పెంచవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం కలెక్టర్ల సదస్సులో భూధార్ ప్రాజెక్టు గురించి ప్రభుత్వ ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ వివరించారు.

  ప్రాజెక్టు ముఖ్యాంశాలు..
  ప్రతి భూమి/స్థలానికి ప్రత్యేకసంఖ్య కేటాయిస్తారు.
  రాష్ట్రంలో 2.30కోట్ల వ్యవసాయ భూములు, పట్టణ ప్రాంతంలో 32లక్షలు, గ్రామీణ ప్రాంతంలో 84లక్షల భూములు/స్థలాలు ఉన్నాయి.
  భూయజమానికి ఆధార్ కార్డుల మాదిరే ఎం-భూధార్ కార్డు ఇస్తారు. దానిలో అతనికి చెందిన భూములు, స్థలాల వివరాలన్నీ ఉంటాయి. ఇ-భూదార్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్లో ఇ-కేవైసీలా ఇక్కడ ఇ-కేవైబీ ఉంటుంది.
  భూధార్ లో 1. భూమి సమాచారం. 2. మ్యుటేషన్ 3. ఇకేవైబీ 4. వ్యవసాయ భూమి వినియోగ మార్పిడి 5. ప్రభుత్వ భూముల సంరక్షణ 6.మార్కెట్ విలువలు. 7. అనుమతించిన లేఅవుట్లు 8. అటవీ, రక్షిత అటవీ ప్రాంతం వంటి వివరాలను అనుసంధానం చేస్తారు.
  భూధార్లో 11 అంకెల సంఖ్య ఉంటుంది. 28తో ఇది మొదలవుతుంది. 28 సెన్సస్ కోడ్.
  జియో రిఫరెన్స్ చేయని వాటికి 99తో ప్రారంభించి మొదట తాత్కాలిక నంబరు కేటాయిస్తారు.
  00తో మొదలుపెట్టినవి ప్రభుత్వం, సంస్థల భూములు.
  కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టారు.