అల్లం నారాయణకు ‘ఆవుల సాంబశివరావు’ పురస్కారం

    0
    12

    తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణకు 2019 సంవత్సరానికిగానూ ‘జస్టిస్‌ ఆవుల సాంబశివరావు’ పురస్కారం దక్కింది.

    పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య పుంజాల అలేఖ్య శుక్రవారం ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తొలి లోకాయుక్త జస్టిస్‌ ఆవుల సాంబశివరావు పేరిట ఏటా మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం ద్వారా వర్సిటీ ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది. ఈ నెల 30న తెలుగు వర్సిటీలో జరిగే కార్యక్రమంలో అల్లం నారాయణకు పురస్కారం కింద ప్రశంసాపత్రంతో పాటు రూ.25 వేల నగదు అందించి సత్కరిస్తారు.

    జస్టిస్ ఆవుల సాంబశివరావు (మార్చి 16, 1917 – జులై 27, 2003 ) ప్రముఖ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, ప్రముఖ హేతువాది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. రాడికల్ హ్యూమనిస్ట్ భారత సంఘాధ్యక్షుడు. ఇండియన్ రేషనలిస్ట్ పత్రిక సంపాదకులు. సాంబశివరావు 1917లో మార్చి 16వ తేదీన గుంటూరు జిల్లా మూల్పూరులో ఆవుల బాపమ్మ, ఆదియ్య దంపతులకు జన్మించాడు.

    సాంబశివరావు తొలినాళ్లలో, సమాజంలో బానిసత్వం, పేదరికం, వెనకబాటుతనం, అంధ విశ్వాసాలు ఇవన్నీ రూపుమాసిపోవాలంటే కమ్యూనిస్టు భావజాలమే శరణ్యం అని భావించినా, ఎం.ఎన్. రాయ్ స్ఫూర్తితో నవ్య మానవవాదాన్ని అవలంబించారు. మానవ సమాజంలో మానవత్వాన్ని వెలిగిస్తే చీకట్లు తొలగిపోతాయని భావించాడు. బుద్ధుడి విశ్వప్రేమ, త్రిపురనేని రామస్వామి చౌదరి సంస్కరణ, హేతువాద భావాలు ఆయన ఆలోచనలకు పునాదులు వేశాయి. అరవయ్యేళ్లకు పైగా ఏ పదవిలో ఉన్నా, ఏచోట ప్రసంగించినా, మానవత్వాన్ని శాస్త్రంతో మిళతం చేసి పనిచేశారు. పాలేర్లతో పాటు తననీ కూర్చోబెట్టి అన్నం పెట్టిన తల్లి మంచి మానవతావాది అన్నారు.

    సాంబశివరావు అవసరమైతే తప్పఇంగ్లీషు మాట్లాడేవారు కాదు. లోకాయుక్తగా ఆయన తెలుగులో అందుకొన్న ఫిర్యాదులకు తెలుగులోనే తీర్పులు చెప్పే విధానం ప్రవేశపెట్టారు. ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రి అయ్యాక తెలుగు భాషాసాహిత్యాలు, కళలు, చారిత్రక వికాసానికి ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు వెనుక ఆయన కృషి ఉంది. తెలుగు విద్యార్థి పత్రికలో రెండు దశాబ్దాలకుపైగా శీర్షికను కొనసాగించాడు. తెలుగుయూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్‌ ఆవుల మంజులత ఈయన కుమార్తె.