అరిహంత్ తొలి అణు నిరోధక గస్తీ పూర్తి

  0
  24

  భారత నౌకాదళానికి చెందిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ తన తొలి అణు నిరోధక గస్తీని విజయవంతంగా పూర్తి చేసింది.

  ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న వంబర్ 5న వెల్లడించారు. దేశీయంగా తయారైన తొలి అణు జలాంతర్గామి అయిన అరిహంత్ గరిష్టంగా 3,500 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలపై అణు దాడి చేయగలదు.

  అరిహంత్ విజయవంతం కావడంతో నీరు, భూమి, ఆకాశం.. ఈ మూడింటిలో ఎక్కడినుంచైనా అణ్వాయుధాలను ప్రయోగించే ఆరో దేశంగా భారత్ అవతరించింది. ఇప్పటికే ఆకాశం నుంచి మిరేజ్-2000 యుద్ధ విమానం ద్వారా, భూమి నుంచి అగ్ని బాలిస్టిక్ క్షిపణి ద్వారా అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యాలు భారత్కు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ లకు గాలి, నీరు, భూమి నుంచి అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యం ఉంది.

  అడ్వాన్స్ డ్ టెక్నాలజీ వెస్సెల్ (ఏటీవీ) అనే రహస్య ప్రాజెక్టు కింద ఐఎన్ఎస్ అరిహంత్తోపాటు మరో రెండు అణు జలాంతర్గాములను అభివృద్ధి చేయడం 1990ల్లోనే మొదలైంది. ఐఎన్ఎస్ అరిహంత్ మొదటిది కాగా, రెండోదైన ఐఎన్ఎస్ అరిధమన్ తయారీ 2018లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. అరిహంత్ను అణు నిపుణులతో కలిసి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసింది.

  అరిహంత్ విశేషాలు…
  • అరిహంత్ అంటే శత్రు సంహారిణి అని అర్థం.
  • జలాంతర్గాముల నుంచి ప్రయోగించే పన్నెండు కె-15 బాలిస్టిక్ క్షిపణులను అరిహంత్ మోసుకెళ్లగలదు.
  • ఐఎన్ఎస్ అరిహంత్ పొడవు, వెడల్పులు వరుసగా 110 మీటర్లు, 11 మీటర్లు.
  • నీటిలో 300 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. 83 మెగా వాట్ల అణు విద్యుత్తు రియాక్టర్ ఇందులో ఉంటుంది.
  • ఉపరితలానికి రాకుండా సముద్ర గర్భంలోనే కొన్ని నెలలపాటు ప్రయాణించగలదు.
  • కార్గిల్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2009 జూలైలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ విశాఖపట్నంలోని నౌకా నిర్మాణ కేంద్రం నుంచి అరిహంత్ ను తొలిసారిగా సముద్రంలోకి పంపారు.
  • అనేక పరీక్షల అనంతరం 2016లో ఐఎన్ఎస్ అరిహంత్ ను నౌకా దళంలోకి తీసుకున్నారు.